గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరిలయన్స్‌ పవర్‌ ఆస్తులు రూ.2,033 కోట్లు జప్తు

8 గంటల క్రితం

రిలయన్స్‌ పవర్‌ రూ.2,033 కోట్ల ఆస్తుల జప్తు
విదేశాలకు నిధుల మళ్లింపుపై ఇడి దర్యాప్తు
నకిలీ పత్రాలతో లావాదేవీలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 08:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విదేశాలకు నిధుల మళ్లింపుపై ఇడి దర్యాప్తు

  • నకిలీ పత్రాలతో లావాదేవీలు

​న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ‌దిగ్గజం అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) తీవ్ర చర్యలు చేపట్టింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై రూ.2,032.81 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో రిలయన్స్‌ పవర్‌ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని నిల్వలతోపాటు సాసన్‌ పవర్‌ లిమిటెడ్‌లో సంస్థకున్న వాటాలు ఉన్నాయి. విదేశీ మారక నగదును నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో ఉంచినట్లు గుర్తించిన నేపథ్యంలో.. అందుకు సమానమైన విలువగల భారత్‌‌లోని ఆస్తులను ఫెమా చట్టంలోని సెక్షన్‌ 37ఎ కింద స్వాధీనం చేసుకున్నట్లు ఇడి వెల్లడించింది. విదేశీ పెట్టుబడులు, అడ్వాన్సుల పేరుతో రిలయన్స్‌ పవర్‌ తన ఖాతాల్లో రూ.2,101.46 కోట్లను రద్దు చేయడం, నష్టాల కోసం కేటాయింపులు జరపడంపై సెబీ అందించిన సమాచారంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. ఇడి అధికారుల సమాచారం ప్రకారం.. 2006లో రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌) విదేశీ కరెన్సీ కన్వర్టిబుల్‌ బాండ్ల ద్వారా 30 కోట్ల డాలర్లు (రూ.2,800 కోట్లు) సమీకరించింది. ఇందులో 27.5 కోట్ల డాలర్లను సింగపూర్‌లోని తన అనుబంధ సంస్థ రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ (సింగపూర్‌)లో పెట్టుబడిగా పెట్టింది. అనంతరం ఈ నిధులను స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న డాయిష్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసింది. ఆ డిపాజిట్లను హామీగా చూపించి బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ (బివిఐ)లో నమోదైన కంపెనీలకు రుణాలు ఇప్పించినట్లు ఇడి గుర్తించింది. ఈ విదేశీ కంపెనీలను అనిల్‌ అంబానీ గ్రూపు భారత్‌ నుంచే బినామీ వ్యక్తుల ద్వారా నియంత్రించినట్లు స్పష్టమవుతోంది. ఈ రుణాల ద్వారా సమకూరిన నిధుల్లో కొంత మొత్తాన్ని మారిషస్‌కు చెందిన విదేశీ సంస్థల ద్వారా తాత్కాలికంగా భారత్‌కు మళ్లించినట్లు ఇడి పేర్కొంది. మరికొన్ని నిధులను అనిల్‌ అంబానీ గ్రూపు ప్రయోజనాలకు వినియోగించడంతోపాటు విదేశాల్లోనే ఉంచినట్లు అనుమానిస్తోంది. ఈ కేసులో 2026 మార్చి 6 నుంచి 8 వరకు ఇడి సోదాలు నిర్వహించింది. విదేశాల్లోని నిధుల అంతిమ లబ్ధిదారులు ఎవరు, ఆ సొమ్ము ఎక్కడికి చేరింది, విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఎలా ఉల్లంఘించారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్