గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎస్‌బిఐ ఖాతాదారుల సమాచార చోరీపై సమగ్ర విచారణ జరపాలి

17 నిమిషాల క్రితం

MP A. A. Rahim.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 11:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపి ఎ.ఎ. రహీం లేఖ

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం చోరీకి గురై డార్క్‌ వెబ్‌లో అందుబాటులోకి వచ్చిన ఘటనపై వేగంగా సమగ్ర విచారణ జరపాలని సిపిఎం రాజ్యసభ సభ్యుడు ఎ.ఎ. రహీం డిమాండ్ చేశారు. ఈ మేర‌కు గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆయ‌న లేఖ రాశారు. ఖాతాదారుల సమాచార భద్రతకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌బిఐ ఖాతాదారుల మొబైల్‌ నెబర్లు, ఇ-మెయిల్‌ చిరునామాలు, బ్యాంకు శాఖల వివరాలు, రుణాలకు సంబంధించిన రికార్డులు సహా వ్యక్తిగత సమాచారం చోరీకి గురవడం అత్యంత తీవ్రమైన విషయమని రహీం పేర్కొన్నారు. ఎంతమంది ఖాతాదారుల సమాచారం చోరీకి గురైంది? ఈ సమాచారం ఎలా బయటకు వచ్చింది? అనే అంశాలపై స్పష్టత లేదని తెలిపారు. కూలీలు, కార్మికులు, రైతులు, మధ్యతరహా వ్యాపారులు సహా కోట్లాది మంది సామాన్య ప్రజలు ఎస్‌బిఐపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభావిత ఖాతాదారులకు అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించాలని, వారి బ్యాంకు ఖాతాల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.

మోసపూరిత లావాదేవీలు జరగకుండా చర్యలు

చోరీకి గురైన సమాచారాన్ని ఉపయోగించి రానున్న రోజుల్లో నకిలీ లావాదేవీలు, ఆర్థిక మోసాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రహీం సూచించారు. ఎంతమంది ఖాతాదారులపై ప్రభావం పడింది? చోరీకి గురైన సమాచారాన్ని ఇప్పటివరకు ఏయే విధాలుగా ఉపయోగించారు? అనే అంశాలపై కచ్చితమైన విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలన్నింటిలోనూ ఖాతాదారుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు కఠినమైన భద్రతా చర్యలు అమలు చేయాలని ఎ.ఎ. రహీం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలో పటిష్టమైన సైబర్‌ సెక్యూరిటీ రక్షణ చర్యలు చేపట్టాలని, ఏవైనా నిర్లక్ష్యం లేదా భద్రతా లోపాలు జరిగితే కఠినమైన జవాబుదారీతనం వహించాలని ఆయన పిలుపునిచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్