- లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి
- బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలి
- కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ : అన్ని ఎన్నికలూ చట్టవిరుద్ధమైనవేనని వ్యాఖ్యానిస్తూ లోక్‌సభను, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను రద్దుచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం డిమాండ్ చేశారు. చివరకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చట్టవిరుద్ధంగానే వున్నారని అన్నారు. అందువల్ల బ్యాలెట్ పత్రాలు ఉపయోగించి తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. నేడు, యావత్ దేశం అక్రమ ఎన్నికలపైనే నడుస్తోందని ఆయన విమర్శించారు. కలబుర్గిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు దుర్వినియోగమవుతున్నాయని, వారి స్వంత వ్యక్తులే ఇది చెబుతున్నారని అన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది..
ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేక అవకతవకలు, లోపభూయిష్టాలతో కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, ఎన్నికల క్రమాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తాయన్నారు. ఒక బూత్‌లో 500 ఓటర్లను తొలగించారంటే ఇక అవి ఏ రకంగా స్వేచ్ఛాయుతమైన, సక్రమ ఎన్నికలని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఆ బూత్‌లతో కొన్ని పేర్లను చేర్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇలా జరగడం వల్ల మన యువత, నిరుపేదలు, దళితులు, సమాజంలో అట్టడుగు వర్గాల వారు దెబ్బతింటారని అన్నారు. కొత్తచట్టం కింద, సిఇసి లేదా ఎన్నికల కమిషనర్లు తప్పు చేస్తేవారిపై ఎప్పటికీ విచారణ వుండదని, దీనివల్ల ప్రజాస్వామ్యం ఏ రీతిన నాశనమవుతుందో చూడచవ్చని ఖర్గే పేర్కొన్నారు. రాబోయే యుపి ఎన్నికల్లో కార్యాచరణ ఏమిటని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ‘‘ఏం చేయగలం? ఎన్నికలను బహిష్కరించగలమా? అని ప్రశ్నించారు. చట్టపరంగా చర్యలు తీసుకుందామని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, చట్టపరంగా ఏం చేయగలం? చట్టం వారితోనే వుంది. న్యాయ వ్యవస్థ వారి చేతుల్లో వుంది, సిఇసి, ఎన్నికల కమిషనర్లు వారితోనే వున్నారు, ఆ యంత్రాన్ని వారే నిర్వహిస్తున్నారు, వారి ఆదేశాల మేరకు అన్నీ జరుగుతాయి. వారి ఆదేశాలకు అనుగుణంగా ఓట్లు మారతాయి. అందువల్లే మోడీని, అమిత్ షాని ముందు ఈ ప్రజాస్వామ్యం నుండి గెంటేయాలని ఖర్గే పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)