న్యూఢిల్లీ : అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు (సెప్టెంబర్ 27) ఆదివారం పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 28 నుండి 30 సమ్మె చేపడుతున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజల అత్యవసర బ్యాంకింగ్ అవసరాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆదివారం సాధారణంగా పనిచేస్తాయని ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 27న అన్ని బ్యాంక్ శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం-అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతిని మంజూరు చేసింది. సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు యూనియన్లకు విజ్ఞప్తి చేశాయని, అలాగే నిత్యావసర బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాయని అది పేర్కొంది. సమ్మె తేదీలకు ముందుగానే నిత్యావసర బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని బ్యాంకులు తమ వినియోగదారులకు సూచించాయి.







కామెంట్‌లు (0)