సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రిజ్‌ భూషణ్‌ని నిర్దోషిగా విడుదలచేయడాన్ని సవాలు చేసిన మహిళా రెజ్లర్లు

2 రోజుల క్రితం

Brij Bhushan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 03:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ అధ్యక్ష‍ుడు బ్రిజ్‌భూషణ్‌ను నిర్దోషిగా విడుదల చేయడాన్ని మహిళా రెజ్లర్లు రౌస్‌ అవెన్యూ కోర్టులో సవాలు చేశారు. ఈ అప్పీల్‌పై ప్రత్యేక జడ్జి (ఎంపి-ఎమ్మెల్యే కేసులు ) దిగ్‌ వినయ్‌ సింగ్‌ శనివారం విచారణ చేపట్టనున్నారు. బ్రిజ్‌భూషణ్‌, డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌లను నిర్దోషులుగా విడుదల చేస్తూ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ అశ్విని పన్వార్‌ ఆగస్టు 3న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రహస్య విచారణల అనంతరం ఈ తీర్పు వెలువడింది. ఈ తీర్పు చట్టబద్ధంగా నిలవదని, రికార్డులో ఉన్న సాక్ష్యాలను తప్పుగా, పక్షపాతంగా అంచనా వేశారని పేర్కొంటూ మహిళా రెజ్లర్లు తీర్పును సవాలు చేశారు.

సంబంధిత కోర్టు తీర్పు ఊహాగానాలు, అనుమానాలపై ఆధారపడి ఉందని, చట్టపరంగా స్థిరపడిన న్యాయ సూత్రాలను సరిగ్గా వర్తింపజేయలేదని అప్పీల్‌లో వాదించారు. తీర్పులోని కీలక అంశాలు లైంగిక దాడి, వేధింపులకు గురైన బాధితులు ఎలా ప్రవర్తించాలనే విషయంలో పాతకాలపు, మూస ధోరణులతో కూడిన అంచనాలపై ఆధారపడి ఉన్నాయని అప్పీలుదారులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల పరిస్థితులు, ఘటనల నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉండగా, బాధితుల ‘ఆశించిన ప్రవర్తన’ ఆధారంగా వాటిని అంచనా వేశారని ఆరోపించారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లు ఆయనపై చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కేసు కొనసాగుతోంది.

బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 2023లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ రెజ్లర్లు నిరసన చేపట్టారు. అనంతరం ఈ ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 2023 జూన్‌లో బ్రిజ్‌భూషన్‌, తోమర్‌లపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. బిఎన్‌ఎస్‌లోని సెక్షన్లు 354, 354ఎ, 354డి, 506తో సహా పలు నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఐదుగురు ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణలకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు 2024 మేలో బ్రిజ్‌భూషణ్‌పై అభియోగాలు మోపగా, మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదుకు సంబంధించి అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. ఒక ఫిర్యాదుదారునికి సంబంధించి తోమర్‌పై నేరపూరిత బెదిరింపుల అభియోగాలు మోపబడ్డాయి. ప్రాసిక్యూషన్‌, ఫిర్యాదుదారులు, నిందితుల వాదనలు విన్న కోర్టు ఆగస్టు 3న బ్రిజ్ భూషణ్‌, తోమర్‌లను నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పును సవాలు చేసిన అప్పీల్‌ శనివారం సెషన్స్‌ కోర్టు ఎదుట పరిశీలనకు రానుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్