- ఎస్‌ఇఎం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : సిజెపి నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల కస్టడీని సోమవారం నాడు మరో రెండు రోజులకు పొడిగించారు. ఈ మేరకు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్‌ఇఎం) కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ తర్వాత, సోమవారం నాడు ఈ ఇద్దర్నీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌ఇఎం కోర్టు ముందు ఢిల్లీ పోలీసులు హాజరుపరిచారు. నిబంధనలను ఉల్లంఘించి జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారని, జాతీయ జెండాను ఎగురవేశారనే అభియోగాలతో ఈ నెల 14న సిజెపి నాయకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం ఉందని, కాబట్టి వీరికి మరో ఐదు రోజుల కస్టడీని కోర్టును ఢిల్లీ పోలీసులు సోమవారం నాడు కోరారు. అయితే, తమ నుంచి కొత్తగా ఎలాంటి నిరసన పిలుపులూ రాలేదని, అందువల్ల తమకు బెయిల్ మంజూరు చేయాలని రాంకా, దాస్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విచారణ సోమవారం సాయంత్రం ప్రారంభమయింది. ఈ విచారణను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని సిజెపి అధికార ప్రతినిధి, న్యాయ సలహాదారు రత్నా సింగ్ విమర్శించారు. ‘నిజానికి ఈ కేసు విచారణ మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉంది. కానీ వారు దానిని సాయంత్రం వరకు వాయిదా వేస్తూ వచ్చారు. సాయంత్రం 5 గంటలకు విచారణ ప్రారంభించారు. అశుతోష్, సౌరవ్‌లను ఉద్దేశపూర్వకంగా లోపలే ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు” అని తెలిపారు. సిజెపి నాయకులపై రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి కానాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లోనూ, రెండోది పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లోనూ నమోదైంది.







కామెంట్‌లు (0)