- ఢిల్లీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీలో నిరసనలకు సంబంధించి నిర్బంధంలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను విడుదల చేయాలని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రితు రాజ్ ఆదేశించారు. వారు సమర్పించిన పూచీకత్తులను అంగీకరించిన అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు వారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలన్న ఢిల్లీ పోలీసుల అభ్యర్థనపై బుధవారం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రితు రాజ్ విచారణ చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని, రాజ్యాంగ పరిధిలోనే నిరసనలు నిర్వహిస్తామని, నిరసన స్థలంగా గుర్తింపు లేని ప్రాంతంగా ఉన్నంత కాలం జంతర్ మంతర్‌లో ఆందోళనలకు పిలుపునివ్వబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో విడుదల చేయాలని రితురాజ్ ఆదేశించారు. సిఇసి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ నెల 13న సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14న వీరిని ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. 19న మరో రెండు రోజులపాటు కస్టడీని పొడిగించారు. తాజాగా మరో మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు అభ్యర్థించగా, మేజిస్ట్రేట్ విడుదలకు ఆదేశించారు.







కామెంట్‌లు (0)