- తక్షణమే జోక్యం చేసుకోండి!
- జనగణన నిబంధనలకు సవరణలపై రాష్ట్రపతికి సిపిఎం లేఖ
న్యూఢిల్లీ : జనగణన మరో ఎస్ఐఆర్గా మారకుండా చూడాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. నిఘా, పౌరసత్వ నిర్ధారణ లేదా ఎన్నికల ప్రక్రియ నుండి మినహాయింపులకు జనగణన ఒక సాధనంగా మారకుండా చూడాలని కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో, భారత రిపబ్లిక్ రాజ్యాంగ అధిపతిగా అత్యవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, తాజా సవరణలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని బేబీ ఆ లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ సూత్రాలకు, ప్రజా విశ్వాసానికి అనుగుణంగా వుండే పద్ధతిలో జనగణన ప్రక్రియను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జనగణన నిబంధనలు, 1990కి ఈ నెల 16వ తేదీన కేంద్ర హోం శాఖ చేసిన సవరణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తాము ఈ లేఖను రాస్తున్నామని బేబీ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన ప్రక్రియ సమగ్రత, నిష్పాక్షికత, విశ్వసనీయతను పరిరక్షించేందుకు తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. జనగణన (సవరణ) నిబంధనల, 2026లో నోటిఫై చేసిన సవరణల ప్రకారం, జనగణన ఎన్యూమరేటర్లుగా నియమించబోయే వ్యక్తుల కేటగిరీలను గణనీయంగా విస్తరించారు. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్లను, సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్‌ల ఉద్యోగులు, అధికారులను నియమించేందుకు ఈ సవరణలు అనుమతిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, బ్యాంకులు, కంపెనీలు, ఇతర సంస్థలకు చెందిన అధికారులు, క్లర్కులు వంటి సిబ్బందిని కూడా జనగణన పనుల కోసం నియమించవచ్చు. అన్నింటికంటే అత్యంత ఆందోళన కలిగించే అంశమేమంటే, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంత పాలనా విభాగానికి చెందిన వ్యక్తులెవరైనా కూడా ఈ కార్యకలాపాలకు అనువుగా వుంటారనుకుంటే వారిని కూడా నియమించుకోవచ్చునని తెలిపారు. ఎంపిక ప్రామాణికాలు, నియమితులైన వారి నిష్పాక్షికత, పక్షపాత జోక్యానికి వ్యతిరేకంగా రక్షణలు వంటి వాటిపై తీవ్రమైన ప్రశ్నలను ఆ లేఖలో బేబీ లేవనెత్తారు. స్పష్టంగా నిర్దేశిత ప్రామాణికాలు లేదా ప్రజలకు జవాబుదారీగా వుండే రక్షణలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా విభాగాలకు కల్పించబడిన విచక్షణాధికారం ఏకపక్షంగా, రాజకీయంగా ఉద్దేశపూరితమైన నియామకాలు చేపట్టడానికి గణనీయంగా అవకాశం కల్పిస్తోందని విమర్శించారు. ఈ జనగణన ప్రక్రియ కింద ప్రతి ఒక్క కుటుంబం, వ్యక్తి నుండి విస్తృతమైన స్థాయిలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. తమకు నమ్మకం కుదరకపోతే ఆ వ్యక్తులతో అటువంటి సమాచారాన్ని పంచుకోవడానికి వారు విముఖంగా వుండవచ్చు. ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో తాము ఇచ్చే సమాచారాన్ని రాజకీయకోణంలో తమను విశ్లేషించడానికి ఉపయోగిస్తారని, అలాగే ప్రత్యేకంగా కొన్ని కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుంటారని, తమ పౌరసత్వాన్ని ప్రశ్నిస్తారని లేదా తమను చట్టబద్ధమైన హక్కులు, అర్హతల నుండి బహిష్కరిస్తారన్న భయం వుంటుందని, అది నిజమేనని బేబీ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులను ముఖ్యంగా పాలక వ్యవస్థతో రాజకీయ సంబంధాలున్న వారిని నియమించడం వల్ల ఈ ప్రక్రియ విశ్వసనీయతే తుడిచిపెట్టుకుపోతుందని లేఖ పేర్కొంది.
తల్లిదండ్రుల మతం, ఐడిలు లాంటి వ్యక్తిగత వివరాల సేకరణను ఆపేయాలని విజ్ఞప్తి
రెండో దశ జనగణన 2027కు ఈ ఏడాది ఆగస్టు 14న నోటిఫై చేసిన ప్రశ్నావళితో కలిపి చూసినట్లైతే ఈ ఆందోళనలు మరింత తీవ్రంగా మారుతున్నాయని బేబీ స్పష్టం చేశారు. తల్లిదండ్రుల మతం, బ్యాంక్ఖాతాల వివరాలు, ఆధార్, ఇతర ఐడిలు, పాస్‌పోర్ట్, మొబైల్ నెంబర్‌తో సహా ఇంకా ఇతరత్రా వివరాలతో విస్తృత స్థాయిలో సమాచారాన్ని ఈ ప్రశ్నావళి కోరుతోంది. ఇలా వ్యక్తిగత వివరాలను సేకరించడాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24న భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్‌కు సిపిఎం మెమొరాండాన్ని అందజేసింది. జనగణన డేటాను మరే ఇతర డేటాబేస్‌లతో అనుసంధానించరాదని, లేదా దేనికోసమైతే ఈ సమాచారాన్ని సేకరించారో దానికి మించి మరే ఇతర ప్రయోజనాల కోసం దాన్ని మళ్లించకుండా వుండేలా చూసేందుకు కఠినమైన రక్షణలు ఏర్పాటు చేయాలని కూడా ఆ మెమొరాండం కోరింది. జనగణన నిబంధనలకు తాజాగా సవరణలు చేసిన నేపథ్యంలో ఆ మెమొరాండంలో లేవనెత్తిన ఆందోళనలు మరింత ఆవశ్యకతను సంతరించుకున్నాయి. అస్పష్టమైన విధానాలు, ఏకపక్ష డాక్యుమెంటేషన్ అవసరాలు వంటి వాటి ద్వారా అర్హులైన పౌరులను కూడా మినహాయిస్తున్నారని ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అనుభవాలు చూస్తే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో విస్తరించిన, తగినంతగా నియంత్రించబడని ఎన్యూమరేటర్ల నెట్వర్క్ ద్వారా జాతీయస్థాయిలో సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అవకాశం వుండడం అత్యంత ఆందోళన చెందే అంశమని బేబీ పేర్కొన్నారు. జనగణన భారత ప్రజలకు సంబంధించిన జాతీయ స్థాయి ప్రక్రియ. అటువంటప్పుడు అధికారంలో వున్న పార్టీ రాజకీయ ప్రయోజనాలు లేదా ఆ పార్టీ భావజాల అనుబంధ సంస్థల రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఒక సాధనంగా మారేందుకు ఎంతమాత్రమూ దీన్ని అనుమతించరాదని లేఖ స్పష్టం చేసింది.







కామెంట్లు (0)