- మధ్యప్రదేశ్‌లో కలకలం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో నర్సింగ్ కళాశాలల గుర్తింపు, ధ్రువీకరణపై మరో వివాదం వెలుగులోకి వచ్చింది. నర్సుల రిజిస్ట్రేషన్ కౌన్సిల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఒక గాడిద పేరుతో తాత్కాలిక నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ కావడం కలకలం రేపింది. పోర్టల్‌లో పత్రాల ధ్రువీకరణ వ్యవస్థను పరీక్షించేందుకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి పర్మార్ ఈ ప్రయోగం చేసినట్లు తెలిపారు. గాడిద ఫొటోతో పాటు నకిలీ పత్రాలను అప్‌లోడ్ చేసి, నిర్ణీత రుసుము చెల్లించగా.. పోర్టల్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులో పేరు ‘గాడిద’, తండ్రి పేరు ‘గాడిద తండ్రి’గా నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు డిజిలాకర్ ఆధారిత ధ్రువీకరణను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు చర్యలు చేపట్టారు. జారీ చేసినది కేవలం తాత్కాలిక సర్టిఫికెట్ మాత్రమేనని కౌన్సిల్ అధ్యక్షుడు వేణు కుష్వాహా తెలిపారు. తుది రిజిస్ట్రేషన్‌కు ముందుగా ఆన్‌లైన్ ధ్రువీకరణ జరుగుతుందని, తప్పుడు సమాచారం అందించిన దరఖాస్తులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో నర్సింగ్ కళాశాలల నాణ్యతపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన వ్యవస్థలోని లోపాలను మరోసారి తెరపైకి తెచ్చింది. హైకోర్టు ఆదేశాల అనంతరం 308 కళాశాలలను పరిశీలించిన సీబీఐ.. 139 కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా లేవని గుర్తించినట్లు సమాచారం.








కామెంట్‌లు (0)