ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈ నెల 15న బిర్సా ముండా దినోత్సవాన్ని 36వ అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) మహాసభల జెండా దినోత్సవంగా నిర్వహించాలని ఆ సంఘం పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల్లోని ఎఐకెఎస్ కమిటీలు కార్యాలయాలు, గ్రామాలను జెండాలు, తోరణాలతో అలంకరించాలని కోరింది. ప్రభాత భేరీలు, ప్రదర్శనలు నిర్వహించి కార్పొరేట్-మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాల్సిన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
ఈ నెల 15 నుంచి 18 వరకు తెలంగాణలోని నల్లగొండలో 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలు జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, అధ్యక్షులు అశోక్ ధావలే ప్రకటన విడుదల చేశారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఆదివాసీల భూమి హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన వీర యోధుడు బిర్సా ముండా జయంతి ఈ నెల 15న నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఆదివాసీలను బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు ఆయన సాగించిన పోరాటాన్ని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి చారిత్రాత్మక కేంద్రంగా నిలిచిన నల్లగొండలో మహాసభలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు.







కామెంట్‌లు (0)