గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రైవేటీకరణపై హర్యానా విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె

24 నిమిషాల క్రితం

ప్రైవేటీకరణపై హర్యానా విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె
సమాంతర విద్యుత్‌ పంపిణీ లైసెన్స్‌‌ను రద్దు చేయాలని డిమాండ్‌
సమ్మెకు ఇఇఎఫ్‌ఐ మద్దతు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 11:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సమాంతర విద్యుత్‌ పంపిణీ లైసెన్స్‌‌ను రద్దు చేయాలని డిమాండ్‌

  • సమ్మెకు ఇఇఎఫ్‌ఐ మద్దతు

న్యూఢిల్లీ : ప్రైవేటీకరణలో భాగంగా తీసుకొచ్చిన సమాంతర లైసెన్స్‌ ‌విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ హర్యానాకు చెందిన విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు దిగారు. ఈ నెల 21న రాత్రి 10గంటల సమయంలో ప్రారంభమైన ఈ సమ్మె శనివారం వరకు కొనసాగనుంది. హర్యానా విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్ల సంయుక్త పోరాట వేదిక నేతృత్వంలో ఈ సమ్మె జరుగుతోంది. దాదాపుగా 55వేల మంది ఉద్యోగులు, ఇంజనీర్లు సమ్మెలో పాల్గొన్నారు. హర్యానా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన సమ్మెను ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఇఇఎఫ్‌ఐ) అభినందించింది. ఈ సమ్మె చారిత్రకమైనదని వ్యాఖ్యానించింది.

దేశంలోనే తొలిసారి ప్రైవేట్‌ ‌సంస్థకు డిస్ట్రిబ్యూషన్‌ ‌లైసెన్స్‌

గురుగ్రామ్‌, నువాల కోసం ఎలెవన్‌ ‌పవర్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌‌కు 25 ఏళ్లపాటు సమాంతరంగా డిస్ట్రిబ్యూషన్‌ ‌లైసెన్స్‌‌ను మంజూరు చేస్తూ ఈ నెల 19న హర్యానా ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (‌హెచ్‌ఇఆర్‌సి) ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి లైసెన్స్‌ ‌జారీ చేయడం హర్యానాలోనే కాదు మొత్తంగా దేశంలోనే తొలిసారి. తక్షణమే ఈ లైసెన్స్‌‌ను రద్దు చేయాలని, సమాంతర లైసెన్సింగ్‌కు వ్యతిరేకంగా కచ్చితమైన ప్రభుత్వ విధానాన్ని ప్రకటించాలని విద్యుత్‌ ఉద్యోగులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. గతేడాది జూన్‌‌లోనే ఈ కంపెనీని ఏర్పాటు చేసినప్పటికీ ఈ లైసెన్స్‌ ‌పరిధిలోకి 8.3లక్షల మందికి పైగా వినియోగదారులు వస్తున్నారు. ఈ కంపెనీ చెల్లించిన మూల ధనం కేవలం కోటి రూపాయలు మాత్రమే. ప్రభుత్వ స్వంత సంస్థలు, రైతులు, ఉద్యోగులు ఇలా అందరూ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను తోసిపుచ్చుతూ, మైగ్రేషన్‌ ‌ఫ్రేమ్‌‌వర్క్‌, నిలిచిపోయిన వ్యయాలు వంటి అంశాలన్నింటినీ తర్వాత పరిష్కరించడానికి విడిచిపెడుతూ హెచ్‌ఇఆర్‌‌సి లైసెన్స్‌‌ను మంజూరు చేసింది.

లాభాలన్నీ ప్రైవేటు ఆపరేటర్లకే..

ప్రైవేట్‌ ఆపరేటర్లు ఎక్కువగా చెల్లించే సామర్ధ్యం కలిగిన వినియోగదారులనే లక్ష్యంగా చేసుకుంటారు. దీనివల్ల ప్రభుత్వ వినియోగ సంస్థల ఆదాయంలో అసమానమైన రీతిలో ఆదాయం పక్కకు మళ్లుతుందని, ఫలితంగా రైతులు, నిరుపేద వినియోగదారులకు సేవలు సన్నగిల్లుతాయని ఇఇఎఫ్‌ఐ ఆందోళన వ్యక్తం చేసింది. లాభాలన్నీ ప్రైవేటు పరమవుతాయని, సార్వజనీన విద్యుత్‌ ‌సరఫరా భారం ప్రభుత్వ సంస్థలపై పడుతుందని పేర్కొంది.

ఇదంతా ప్రభుత్వ విద్యుత్‌ ‌పంపిణీపై ఒకపద్ధతి ప్రకారం జరుగుతున్న దాడి అని ఇఇఎఫ్‌ఐ విమర్శించింది. ప్రైవేటీకరణ దిశగా ప్రమాదకరమైన చర్య అని వ్యాఖ్యానించింది. అన్ని ప్రాంతాల్లోనూ దాదాపు వంద శాతం సమ్మె జరిగింది. హర్యానా ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (‌హెచ్‌ఇఆర్‌సి) ఉత్తర్వులు జారీ చేసిందని, తాము లైసెన్స్‌‌ను వ్యతిరేకించామని హర్యానా ప్రభుత్వం చెబితే సరిపోదని, ప్రజా ప్రయోజనం కలిగిన అంశాల్లో విధి విధానాలను కమిషన్‌‌కు నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వుందని సమాఖ్య స్పష్టం చేసింది. హర్యానా విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా సంఘీభావ కార్యాచరణను ప్రతి రాష్ట్రంలోనూ చేపట్టాలని అన్ని సంఘాలకు ఇఇఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్