బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోరాటం ఆగదు..

1 గంట క్రితం

rahul-1791390783522-7699.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 01:35 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • రెండో రోజూ ‘ఇండియా’ నేతల ఆందోళన

  • జంతర్‌‌మంతర్‌ వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

  • రాహుల్‌, ప్రియాంక సహా ప్రతిపక్ష‍ ఎంపిల అరెస్టు

  • జ్ఞానేష్‌ గద్దె దిగేదాకా ఉద్యమం ఆగదని నేతల స్పష్టీకరణ

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ​ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న ప్రతిప క్షాల ఆందోళనలు బుధవారం కూడా కొన సాగాయి. జన్‌పథ్‌ నుంచి అనూహ్యరీతిలో ‘ఇండియా బ్లాక్‌’ ఎంపిలు జంతర్‌మంతర్‌ వైపు చేపట్టిన మార్చ్‌ను అశోక్‌రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఢిల్లీలో బుధవారం సాయంత్రం హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎంపిల‌ను, నిరసనకారులను ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు అడ్డుకుని ఎంపిల‌ను అరెస్టు చేశాయి. ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో కుక్కేశారు. ఈ క్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష‍ నేత రాహుల్‌ గాంధీ, ఎంపిలు ప్రియాంక గాంధీ, జాన్‌ బ్రిట్టాస్‌ సహా పలువురు ఎంపిలకు, కార్యకర్తలకు గాయాలయ్యా యి. పోలీసులు తమను కింద పడేసి రక్కేశారని ప్రియాంక గాంధీ వాపోయారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇలాంటి చర్యలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ వైదొలిగేవరకు ప్రతిపక్ష‍ాల పోరాటం కొనసాగుతుందని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. మోడీ, అమిత్‌ షా నిర్దేశనంలో పోలీసులు తమను ఎంతగా అణిచివేయాలని చూస్తారో..తాము అంతే తీవ్రతతో ప్రతిఘటిస్తామని, జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేసేదాకా ఢిల్లీ వీధులను వీడే ప్రసక్తే లేదని సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ తేల్చి చెప్పారు.

బుధ‌వారం మధ్యాహ్నం జనపథ్‌లోని సాగర్‌ రత్న హోటల్‌ నుంచి ప్రతిపక్ష ఎంపిలు మూడు బస్సుల్లో జంతర్‌మంతర్‌కు బయలుదేరారు. మార్గ‌మ‌ధ్య‌లో అశోక్‌ రోడ్‌ వద్ద బస్సులను ఢిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. జంతర్‌మంతర్‌కు తరలివస్తున్న వేలాది మంది కార్యకర్తలను కూడా పోలీసులు మార్గమధ్యంలో నిలిపివేశారు. దీంతో ఎంపిలు నడిరోడ్డుపైనే ప‌డుకొని బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రియాంకగాంధీ నేతృత్వంలో పలువురు మహిళా ఎంపిలు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నిరసనకారులు అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్ర‌తిప‌క్ష ఎంపిలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మహిళా కార్యకర్తలు, నేతలను కూడా ఈడ్చుకెళ్ళి బ‌స్సుల్లో కుక్కారు. సిపిఎం రాజ్యసభ సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌, వి.శివదాసన్‌, ఎ.ఎ.రహీం, సిపిఐ ఎంపి పి.సంతోష్‌కుమార్‌లపై పోలీసులు దాడికి దిగారు. అలాగే, ఎంపిలను అరెస్టు చేయడాన్ని కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కార్యకర్తలను బస్సుల్లోకి ఎక్కించే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. బస్సులపైకి ఎక్కి నిరసన తెలిపిన వారిపై కూడా పోలీసులు లాఠీలు ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురి దుస్తులు చిరిగిపోయాయని, వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. అనంతరం నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఎంపిలను వేర్వేరు పోలీస్‌స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.

priyanka-1791390807411-2563.jpg

​ ఎంపీలతో వ్యవహరించే తీరు ఇదేనా? : ప్రియాంకా గాంధీ

త‌న‌ను మ‌హిళా పోలీసులు కింద ప‌డేశార‌ని, ఒళ్లంతా ర‌క్కార‌ని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఎంపిల‌తో ప్ర‌వ‌ర్తించే తీరు ఇదేనా? ఎంపిల‌ను కొడ‌తారా? ఈడ్చి ప‌డేస్తారా? అని ప్రియాంక గాంధీ ప్ర‌శ్నించారు. మ‌హిళా పోలీసు సిబ్బంది త‌న‌ను కింద‌ప‌డేశార‌ని, ఒళ్లంతా గోళ్ల‌తో గీరార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈసిని క‌లుద్దామ‌ని ఎంపిలు అడ‌గ‌డం నేర‌మా? అని అన్నారు. ప్ర‌జాస్వామ్యయుతంగా నిర‌స‌న తెలుపుతున్న పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు అప్ర‌జాస్వామిక‌మ‌ని మండిప‌డ్డారు.

​పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత..

అరెస్టు చేసిన అనంతరం ఎంపిలు రాహుల్‌గాంధీ, వి.శివదాసన్‌, ఎ.ఎ.రహీం తదితర ఎంపిలను బ‌ల‌వంతంగా తీసుకెళ్లి పోలీసులు బ‌స్సులో ఎక్కించారు. వారిని బారాఖంబా పోలీస్‌ స్టేషన్‌లో కొన్ని గంటలపాటు ఉంచారు. అక్కడ కూడా ఎంపిలు తమ నిరసన కొనసాగించారు. పోలీస్‌ స్టేషన్‌ వెలుపల పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రియాంకా గాంధీతో పాటు ప‌లువురి ఎంపిలు ఛ‌త్ర‌సాల పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. బారాఖంబా పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద‌కు వెళ్లిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, కేర‌ళం సిఎం స‌తీస‌న్‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. అక్క‌డికి కాంగ్రెస్ నేత‌లు భారీగా చేరుకొని ఆందోళ‌న చేప‌ట్ట‌గా వారిని పోలీసులు నిలువ‌రించారు. దాదాపు రెండు గంట‌ల పాటు రాహుల్ గాంధీ, ఇండియా బ్లాక్ ఎంపిల‌ను విడుద‌ల చేశారు. ప్ర‌తిప‌క్షాల డిమాండ్లు నెర‌వేరే వ‌ర‌కు ఈ ఆందోళ‌న కొన‌సాగుతుంద‌ని రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌ మల్లికార్జున్ ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌ల వెనుక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఉన్నార‌ని, ప్ర‌జాస్వామ్యాన్ని బ‌ల‌హీన‌ప‌రిచేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

​ఎఫ్‌ఐఆర్‌‌లను పతకాలుగానే భావిస్తా : రాహుల్ గాంధీ

ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు సిఇసి జ్ఞానేష్ కుమార్‌ ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష‌నేత‌ రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడితే తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని విమ‌ర్శించారు. తాను ఎఫ్ఐఆర్‌ల‌ను పతకాలుగానే భావిస్తానని చెప్పారు. ఇప్పటివరకు తనపై 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, వంద తన టార్గెట్ అని తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలం క‌లిసి ఇసిని కలవాలనుకున్నామ‌ని చెప్పారు. అందుకే మంగళవారం ఇసిని కలుద్దామని 300 మంది ఎంపిలం వెళ్లామ‌ని, కానీ త‌మ‌కు అనుమతి నిరాకరించారని తెలిపారు. సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. దేశ ద్రోహులపై చర్యలు తీసుకునే వరకు త‌మ‌ పోరాటం ఆగదని చెప్పారు.

​ శాంతియుత నిర‌స‌న‌కారుల‌పై ఢిల్లీ పోలీసులు ‘‘క్రూర‌మైన బ‌ల‌ప్ర‌యోగం’’ చేశార‌ని టిఎంసి ఎంపి మ‌హువా మొయిత్రా విమ‌ర్శించారు. తామంతా ఐక్యంగా ఉన్నామ‌ని, ఆ రాక్ష‌సుడిని త‌రిమికొట్టేంత వ‌ర‌కు తాము పోరాడుతున్నామ‌ని టిఎంసి ఎంపి డెరిక్ ఓబ్రియ‌న్ అన్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌న్న త‌మ డిమాండ్‌ను పున‌రుద్ఘాటించారు. నిర‌స‌న‌కారుల‌పై లాఠీఛార్జ్ జ‌రిగింద‌ని ఆర్‌జెడి ఎంపి మ‌నోజ్ కుమార్ ఝా విమర్శించారు. అరెస్టులు, లాఠీ దెబ్బ‌లు ప‌రిష్కారం కాద‌ని, ఇది ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడే పోరాటమ‌ని సిపిఐ ఎంపి సంతోష్ కుమార్ అన్నారు. అయితే, నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి నివాసంతో పాటు ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళనలను నియంత్రించేందుకు జంతర్‌మంతర్‌ ప్రాంతంలో ఆంక్షలు విధించినప్పటికీ, నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్