శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో ఎపికి ఆరు పురస్కారాలు

1 రోజు క్రితం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో ఎపికి ఆరు పురస్కారాలు
- ఐదు మునిసిపల్ కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీకి అవార్డులు
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న మంత్రి నారాయణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 10:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఐదు మునిసిపల్ కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీకి అవార్డులు

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న మంత్రి నారాయణ

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26 జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఆరు పురస్కారాలు లభించాయని రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన 24 మున్సిపాలిటీల అవార్డుల్లో ఆరు ఆంధ్రప్రదేశ్‌కు రావడం ద్వారా మొత్తం అవార్డుల్లో 25 శాతం రాష్ట్రం దక్కించుకుందని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్ర మున్సిపాలిటీలు మెరుగైన ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర మంత్రి పి. నారాయణ అందుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్లు, కుప్పం మున్సిపాలిటీకి అవార్డులు వరించాయి. సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో విజయవాడ, గుంటూరు, తిరుపతి కార్పొరేషన్‌‌లు అవార్డులు పొందాయి. ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ కేటగిరిలో రాజమండ్రి కార్పొరేషన్ కు అవార్డు దక్కింది. సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ కేటగిరిలో విశాఖపట్నంకి అవార్డు లభించింది. 20వేలు కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరిలో స్వచ్ఛ సిటీగా కుప్పం మున్సిపాలిటీ అవార్డు దక్కించుకుంది. అవార్డుల స్వీకరణ అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26లో దేశవ్యాప్తంగా 60 జాతీయ అవార్డులు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌లోని 123 మున్సిపాలిటీలు పోటీపడ్డాయని తెలిపారు. వీటిలో 24 మున్సిపాలిటీలు అవార్డులకు అర్హత సాధించగా, తుది పోటీలో ఆరు అవార్డులు రాష్ట్రానికి లభించాయని చెప్పారు. గత ఏడాది జాతీయ స్థాయిలో 78 అవార్డులు ప్రకటించగా రాష్ట్రానికి ఐదు మాత్రమే వచ్చాయని వివరించారు. అప్పుడు రాష్ట్రానికి వచ్చిన అవార్డుల శాతం 12.5 కాగా, ఈసారి 25 శాతానికి పెరిగిందన్నారు.

​ఆరు అవార్డులు సాధించిన నగరాలు

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్వచ్ఛ షెహర్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించగా, విజయవాడ జాతీయ స్వచ్ఛ నగరాల జాబితాలో మూడో ర్యాంకు పొందింది. గుంటూరు స్వచ్ఛ షెహర్‌ విభాగంలో మూడో ర్యాంకు సాధించింది. రాజమహేంద్రవరం రాష్ట్రంలోనే తొలి స్వచ్ఛ నగరంగా ప్రామిసింగ్‌ స్వచ్ఛ షెహర్‌ గుర్తింపు పొందింది. తిరుపతి, కుప్పం మున్సిపాలిటీలు స్వచ్ఛ షెహర్‌ జోడీ విభాగంలో మూడో ర్యాంకు సాధించాయి. హిల్‌ స్టేషన్లు, రివర్‌ సిటీస్‌, కోస్టల్‌ సిటీస్‌ తదితర విభాగాల ఆధారంగా అవార్డులు కేటాయించినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే సుమారు 85 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు చెప్పారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసి విడుదల చేసేందుకు ప్రతి మున్సిపాలిటీలో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టిపి) ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కె. పట్టాభిరామ్‌, మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేష్‌కుమార్‌, మున్సిపల్‌ పరిపాలన కమిషనర్‌ పి. సంపత్‌కుమార్‌, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ బి. సునీల్‌కుమార్‌రెడ్డితో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు, కుప్పం మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్