న్యూఢిల్లీ : ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో మైనర్లు, మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలను సుప్రీంకోర్టు సోమవారం సుమోటోగా స్వీకరించింది. పెట్రోలింగ్ నిర్లక్ష్యం, ఢిల్లీ యంత్రాంగ పరిపాలనాపరమైన లోపాల కారణంగా పార్కులు, బస్సులు, మెట్రోస్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాలు అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా మారాయని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై వివరణనివ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. దేశరాజధానిలో నమోదైన అనేక ఘటనలు, ముఖ్యంగా లేడీ శ్రీరామ్ కాలేజీ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్‌లో 17 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారం, స్వరూప్ నగర్‌లో మైనర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం, గ్రేటర్ నొయిడా నుండి ఢిల్లీకి వెళ్తున్న బస్సులో మరో మైనర్‌పై జరిగిన అత్యాచార కేసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు కనీస భద్రత కల్పించడంలో చట్ట అమలు సంస్థలు, ప్రజా పరిపాలనా యంత్రాంగం విఫలమయ్యాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హింసకు గురవుతామన్న భయం లేకుండా గౌరవప్రదంగా జీవించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని స్పష్టం చేసింది. తగినంత వెలుతురు లేకపోవడం, సరైన పర్యవేక్షణ లేకపోవడం, గస్తీ చేపట్టడంలో నిర్లక్ష్యం, నివారించగల ఇతర పరిపాలనా లోపాల కారణంగా రోడ్లు, బస్సులు, మెట్రో స్టేషన్లు, ఫుట్‌బ్రిడ్జ్‌లు మరియు సబ్‌వేలతో సహా ప్రజా ప్రదేశాలు "అధిక ప్రమాదకర ప్రాంతాలు"గా మారడానికి అనుమతించరాదని ధర్మాసనం పేర్కొంది.
నిర్భయ కేసుతో పోలిక చేయడం తప్పలేదు
‘‘సామాజిక దురాచారానికి సంఘీభావం తెలపడం పరిష్కారం కాదు. నేరాల నివారణ, ప్రజాశాంతి పరిరక్షణ, బలహీన వర్గాల రక్షణ బాధ్యతలు అప్పగించిన అధికారులపై జవాబుదారీతనం నిర్ధారిస్తూ, కొలవదగిన రీతిలో స్పందించాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం.. 2012 నాటి నిర్భయ ఘటనతో పోలిక చేయక తప్పడం లేదని వ్యాఖ్యానించింది. గత దశాబ్ద కాలంలో వ్యవస్థాగత చట్ట అమలు యంత్రాంగాలు ఏమైనా ‘‘అర్థవంతమైన పురోగతి’’ సాధించాయా అనే ప్రశ్నను ఈ ఘటన లేవనెత్తుతోందని ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వ అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడం సహజమేనని పేర్కొంటూనే.. జవాబుదారీతనం లేని సంఘీభావ ప్రకటనలు విస్తృత సంస్థాగత సమస్యలను పరిష్కరించలేవని స్పష్టం చేసింది. ఆస్థా కుంజ్ ప్రాంతంలో లైంగిక వేధింపుల ఘటనలపై లేడీ శ్రీరామ్ కళాశాల విద్యార్థినులు గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్న నివేదికలను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆస్థా కుంజ్ కేసులో పోలీసుల స్పందనపై ప్రశ్నలు సంధించింది. ‘‘విచారకరంగా, ఈ ఫిర్యాదులు భద్రతా లోపాలను సరిదిద్దడంలో విఫలమయ్యాయి’’ అని ధర్మాసనం పేర్కొంది.








కామెంట్‌లు (0)