సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కట్టిన 4వ రోజే కూలిన ట్యాంక్ - ఇద్దరు చిన్నారుల మృతి

1 గంట క్రితం

wb
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 07:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గురుగ్రామ్: గురుగ్రామ్‌లోని సెక్టార్-83లో జీ21 సొసైటీ సమీపంలోని మురికివాడలో సిమెంట్ నీటి ట్యాంక్ కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల తల్లులు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు 10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తుతో ఈ సిమెంట్ నీటి ట్యాంక్‌ను నిర్మించారు. ఘటనకు నాలుగు రోజుల ముందు నిర్మాణం పూర్తికాగా, సెప్టెంబర్ 25న ట్యాంక్‌ను నీటితో నింపారు.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు చెందిన షరీఫ్ అలీ, ఆయన భార్య రుబీనా గత ఏడాది నుంచి సెక్టార్-83లో అద్దెకు నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రుబీనా తన నాలుగేళ్ల కుమార్తె సుమయ్యాకు స్నానం చేయిస్తుండగా, మరో మహిళ తన కుమారుడికి స్నానం చేయించేందుకు అక్కడికి వచ్చింది.

అదే సమయంలో నీటి ట్యాంక్ గోడ ఒక్కసారిగా కూలి మహిళలు, చిన్నారులపై పడింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే శిథిలాలను తొలగించి నలుగురిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ఘటనకు సంబంధించి ట్యాంక్ నిర్మించిన కాంట్రాక్టర్‌పై పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106 కింద కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడైన కాంట్రాక్టర్‌ను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం చిన్నారుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్