- అసెంబ్లీలో బిల్లుకు కేబినెట్ ఆమోదం
- ఎస్‌టిలకు మినహాయింపు
భోపాల్ : ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) పేరుతో విద్వేష భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు మరో బిజెపి పాలిత రాష్ర్టం మధ్యప్రదేశ్ సిద్ధమైంది. అనేక ప్రధాన సమస్యలు ప్రజల దైనందిన జీవితాన్ని అతలాకుతలం చేస్తుండగా, వాటిని పక్కన పెట్టి యుసిసి ముసాయిదా బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆదివారం ఆమోదం తెలిపింది. రాజధాని భోపాల్‌కు సమీపంలోని జగదీష్‌పూర్‌లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షత జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లు నుంచి రాష్ట్రంలోని అధిక సంఖ్యలో ఉన్న గిరిజనులు (ఎస్‌టి)లకు మినహాయింపు ఇచ్చారు. బహుభార్యత్వం, ఏకకాలంలో బహుళ వివాహాలు, ట్రిపుల్ తలాక్, నికాహ్ హలాలా వంటి పద్ధతులపై నిషేధం విధించారు. సహజీవన సంబంధాలకు కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా చట్టపరమైన వ్యవస్థ నుండి 'అక్రమ సంతానం' అనే పదాన్ని బిల్లు తొలగించింది. వివాహితులైనా, అవివాహితులైనా, కన్నబిడ్డలైనా, దత్తత తీసుకున్నవారైనా, సరోగసీ లేదా అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఎఆర్‌టి) ద్వారా జన్మించడం.. ఇలా ఏ సంతానమైనా పిల్లలంతా సమాన చట్టపరమైన హోదాను పొందుతారు.
ఇప్పుడు ఈ బిల్లు ఎందుకు? ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింఘర్
ఈ బిల్లు అవసరాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్ ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఇలాంటి చట్టం తీసుకురావాల్సిన ఏముంది. ఈ దేశ ప్రజలంతా భారతీయులు కాదా? .. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు ఎరువుల కొరత వంటి ప్రధాన సమస్యలను బిజెపి ఎందుకు విస్మరిస్తోంది? ఈ సమస్యలపై ఎందుకు చర్చ జరగడం లేదు? రైతుల దుస్థితి లేదా యువత నిరుద్యోగం గురించి అసెంబ్లీ చర్చిస్తుందా? రాష్ట్రంలో ఏం జరుగుతోందో ముఖ్యమంత్రి వివరించాలి’ అని ఆయన అన్నారు.
ఇప్పటి వరకూ దేశంలో మూడు రాష్ర్టాల్లో యుసిసిని అమల్లోకి తీసుకొచ్చారు. 2024లో యుసిసిను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. గుజరాత్ ఈ ఏడాది మార్చిలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అస్సాం మేలో ఈ బిల్లును ఆమోదించినా, ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఛత్తీస్‌గఢ్ కూడా యుసిసి ముసాయిదా బిల్లును రూపొందించడానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.








కామెంట్‌లు (0)