న్యూఢిల్లీ : ఎసిపి వివేక్ భగత్ తనను లైంగికంగా వేధించారని, అనుచితంగా ప్రవర్తించారని వెల్లడించిన మహిళా జర్నలిస్ట్‌ను సోమవారం ఉదయం పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుతో పాటు మరో 17మందిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వారిపై పోలీసులు దాడిచేసి, దారుణంగా కొట్టారని సిజెపి న్యాయవ్యవహారాల అధ్యక్షుడు రత్నసింగ్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తమ వారిని కాపాడుకునేందుకు పోలీసులు బాధితురాలిపై, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వారిపై దాడి చేస్తున్నారని అన్నారు. ఎసిపిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ, స్వతంత్ర జర్నలిస్టులు, కార్యకర్తలు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల బారికేడ్ల మధ్య వారు నిరసన చేపడుతున్నారు. ఆదివారం రాత్రంతా అక్కడే ఉన్నారు. నిరసన నిరసనకారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తుండటంతో స్టేషన్ చుట్టూ భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు.అరెస్టు చేసిన మహిళా జర్నలిస్టును ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారని సహ జర్నలిస్టులు తెలిపారు.
ఎసిపి వివేక్ భగత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఒక మహిళా జర్నలిస్ట్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కొన్ని గంటల పాటు వేచి చూసిన అనంతరం ఈ నిరసన ప్రారంభమైంది. అక్టోబర్ 3న సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ జరిగిన నిరసనను తాను కవర్ చేస్తుండగా, ఆ అధికారి తనను లైంగికంగా వేధించారని మహిళా జర్నలిస్ట్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా బోరాను అదుపులోకి తీసుకోవడాన్ని తాను రికార్డ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని ఆ జర్నలిస్ట్ ఆరోపించారు.
నిరసన సందర్భంగా పోలీసు అధికారులు లైంగిక వేధింపులకు, దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదులు చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిరసన సమయంలో పోలీసులు శాంతిభద్రతల విధులు నిర్వర్తిస్తున్నారని, విధుల్లో భాగంగా తీసుకున్న చర్యలకు వారిపై కేసులు నమోదు చేయలేమని అన్నారు. విచారణ కోసం ఈ ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశామని అన్నారు. సోమవారం ఉదయం వరకు ఈ మూడు కేసుల్లోనూ క్రైమ్ బ్రాంచ్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం గమనార్హం.







కామెంట్‌లు (0)