శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోల్‌కతా దుర్గా పూజా పండాల్ వద్ద తొక్కిసలాట..

1 గంట క్రితం

kolkatta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 17 మంది మృతి!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చోర్‌బాగన్ సర్వజనీన్ దుర్గా పూజా పండాల్ వద్ద భారీ వర్షం, మెరుపుల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యను కోల్‌కతా పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. నగర ఉత్తర భాగంలోని గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శారదా పార్క్ (చోర్‌బాగన్) పూజా పండాల్ వద్ద సాయంత్రం 7.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వర్షం ప్రారంభం కావడంతో పండాల్ వెలుపల వేచి ఉన్న సందర్శకులు ఒక్కసారిగా ముందుకు కదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ క్రమంలో కొందరు రోడ్డుపై పడిపోవడంతో పరిస్థితి విషమించింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని రక్షించి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి (ఎంసీహెచ్) తరలించారు. ఇప్పటివరకు సుమారు 35 మందిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యల కోసం అదనపు బలగాలను, వైద్య బృందాలతో కూడిన అంబులెన్స్‌లను మోహరించారు. సందర్శకుల భద్రత దృష్ట్యా పూజా పండాల్‌ను మూసివేశారు.

తొక్కిసలాటకు పోలీసుల భద్రతా ఏర్పాట్లలో లోపాలే కారణమని పలువురు సందర్శకులు ఆరోపించారు. ఆసుపత్రి, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, కొందరు తీవ్ర గాయాల కారణంగా మరణించగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. బాధితులకు సంబంధించిన సమాచారం కోసం 18003455678 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. చోర్‌బాగన్ పూజా పండాల్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, బాధిత కుటుంబాలకు ధైర్యం కలగాలని కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్