న్యూఢిల్లీ : సిఇసి జ్ఞానేష్ కుమార్కి వ్యతిరేకంగా ఈనెల 10,11 తేదీల్లో యువత చేపట్టిన నిరసనలను రిపోర్ట్ చేస్తున్న సుమారు 43 మంది జర్నలిస్టులను నిర్బంధించారు. పలువురు జర్నలిస్టులపై దాడి జరిగినట్లు జర్నలిస్టుల రక్షణ కమిటీ (సిపిజె) వెల్లడించింది. సిపిజె శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. దేశరాజధాని ఢిల్లీతో పాటు అహ్మదాబాద్, పూణెలలో జర్నలిస్టుల అరెస్టులు జరిగాయని పేర్కొంది. వార్తా కథనాలు, ప్రత్యక్ష ఇంటర్వ్యూలు, అలాగే ఎడిటర్లు, జర్నలిస్టులు, వారి వార్తా సంస్థలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన , ధృవీకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది. న్యూఢిల్లీలో, రెండు రోజుల వ్యవధిలో కనీసం 39 మంది పాత్రికేయులను అదుపులోకి తీసుకున్నారని సిజెపి తెలిపింది. అహ్మదాబాద్లో ఆల్ట్ న్యూస్ కరస్పాండెంట్ కింజాల్, స్క్రోల్స్ కి చెందిన దివ్య ఆశ్లేషా సహా ఇతర నగరాల్లో ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన మరో నలుగురు జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించినట్లు తెలిపింది. అక్టోబర్ 11న ముంబయిలోని శివాజీ పార్క్ నుండి క్వింట్ కి చెందిన స్వాతి చోప్రా, మోహిత్ మన్వానిలను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
న్యాయవాదులు, జర్నలిస్టులు, ఇతర నిపుణులను వారి విధుల నిర్వహణలో అడ్డుకోమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అక్టోబర్
11న సుప్రీంకోర్టులో హామీ ఇచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల నిర్బంధం కొనసాగిందని సిజెపి పేర్కొంది. అధికారులు ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, ఫుటేజీ తొలగించాలని ఒక జర్నలిస్టుపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపింది. మరికొందరిని 65 కి.మీ దూరంలో ఉన్న నిర్బంధ కేంద్రాలకు తరలించిందని వెల్లడించింది. ఐదుగురు జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారని తెలిపింది. స్క్రోల్, బిజినెస్ స్టాంటర్డ్స్, న్యూస్ లాండ్రీ, ఇండియా టుడే వంటి పత్రికలకు చెందిన వారితో పాటు పలువురు స్వతంత్ర జర్నలిస్టులను పోలీసులు తాత్కాలికంగా నిర్బంధించారు.
ఢిల్లీ పోలీసుల చర్యలను ఖండించిన ప్రముఖ పాత్రికేయులు ఎన్.రామ్
ఢిల్లీ పోలీసుల క్రూరమైన చర్యలను ఖండించాలని ది హిందూ పబ్లిషింగ్ గ్రూప్ డైరెక్టర్ ఎన్.రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధానికి, దాడులకు గురైన జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించాలని ఎక్స్ పోస్ట్లో కోరారు. చట్టాన్ని ఉల్లంఘించి, జర్నలిస్టులపై దాడులకు దిగిన యూనిఫాంలో ఉన్న నిందితులను కోర్టు ఎదుట నిలబెట్టాలని పిలుపునిచ్చారు.








కామెంట్లు (0)