శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఐఆర్ ట్రైబ్యునల్‌కు మరో రిటైర్డ్ జడ్జి రాజీనామా

37 నిమిషాల క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 11:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​- బిశ్వజిత్ బసు ప్రకటన

కలకత్తా : పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) అప్పీళ్లను విచారించే ట్రైబ్యునల్ నుంచి కలకత్తా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బిశ్వజిత్ బసు శనివారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ట్రైబ్యునల్స్ నుంచి వైదొలగిన నాలుగో న్యాయమూర్తి బసు కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారు దాఖలు చేసిన 38 లక్షల అప్పీళ్లను విచారించాల్సిన 19 ట్రైబ్యునల్స్ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

​ బసు గతంలోనే ట్రైబ్యునల్స్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ పద్ధతిలో లక్షల కేసులను పరిష్కరించడం కొంత కష్టమే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేపట్టింది కాబట్టి దీన్ని పూర్తి చేయాల్సిందే’ అని ఆయన అన్నారు. తన రాజీనామా లేఖను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర విఠల్‌రావు ఘుగేకు పంపారు. సువేందు అధికారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ‘కమిషన్ ఆన్ ఇన్‌స్టిట్యూషనల్ కరప్షన్’ ఛైర్మన్‌గా కూడా నియమించింది.

​ ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులకు సంబంధించిన అప్పీళ్లను విచారించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్‌లో 19 అప్పీలేట్ ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి ట్రైబ్యునల్‌కు కలకత్తా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తున్నారు. బసుతో పాటు కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం, మాజీ న్యాయమూర్తులు రంజిత్ కుమార్ బాఘ్, ఇంద్రజిత్ ఛటర్జీ ఇప్పటికే రాజీనామా చేశారు. అయతే, పెండింగ్ దరఖాస్తులు నెమ్మదిగా పరిష్కారం అవుతుండటంపై ట్రైబ్యునల్ న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 11న జరిగిన ట్రైబ్యునల్ న్యాయమూర్తుల సమావేశపు మినిట్స్ ప్రకారం, ఇసిఐనెట్ పోర్టల్ అనుకున్న విధంగా పనిచేయడం లేదని మెజారిటీ న్యాయమూర్తులు ఫిర్యాదు చేశారు.

​ ​బెంగాల్‌ ‌రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా 91 లక్షలకు పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఎస్‌ఐఆర్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇది సుమారు 13 శాతం. సెప్టెంబర్‌లో ఇసిఐ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, ‘లాజికల్ డిస్క్రిపెన్సీస్’ కారణంతో జాబితా నుంచి తొలగించిన 27 లక్షల మంది ఓటర్లలో 22 లక్షల మంది తమ తొలగింపును సవాల్ చేస్తూ ట్రైబ్యునల్‌లో అప్పీళ్లు చేశారు. ఎస్‌ఐఆర్ సమయంలో చేర్చిన వారికి వ్యతిరేకంగా కూడా 16.10 లక్షల అప్పీళ్లు దాఖలైనట్లు అఫిడవిట్‌లో తెలిపింది. దీంతో ట్రైబ్యునల్స్ ముందు పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల సంఖ్య మొత్తం 38 లక్షలకు చేరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్