‘ప్రతి చేతిలో త్రివర్ణ పతాకం.. ప్రతి వీధి జంతర్ మంతర్’
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ అక్టోబర్ 23న దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని కాక్రోచ్ జనతా పార్టీ, వివిధ ప్రజాసంఘాలు, పలువురు ప్రముఖులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేశారని వారు విమర్శించారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఎన్నికల సంఘాన్ని నిస్సిగ్గుగా, ఏకపక్షంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిణామాలను నిరసిస్తూ యువత వీధుల్లోకి వచ్చిందని, పలువురు నిరసనకారులు జైళ్లలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిని అడ్డుకోవడానికి ప్రజలంతా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్, ప్రశాంత్ భూషణ్, పరకాల ప్రభాకర్, రాకేష్ తికాయత్, అంజలి భరద్వాజ్, గణేష్ దేవి, తుషార్ గాంధీ, అభిజీత్ దీప్కే, నేహా బోరా, ఐషీ ఘోష్, విరాజ్ దేవాంగ్ తదితరులు ఈ పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 14న విద్యార్థి, యువజన, రైతు, కార్మిక, మహిళా, దళిత, ఆదివాసీ, మైనారిటీ, దివ్యాంగ, ట్రాన్స్‌జెండర్ సంఘాలతో పాటు పలు ప్రజాసంఘాలు సమావేశమయ్యాయని తెలిపారు. ‘పీపుల్ ఎగైనెస్ట్ ఎస్‌ఐఆర్’ బ్యానర్ కింద విస్తృత ఐక్య వేదికను ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
‘ప్రతి చేతిలో త్రివర్ణ పతాకం.. ప్రతి వీధి జంతర్ మంతర్’ అనే నినాదంతో ప్రజలంతా తమ తమ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇక వేచి చూసే సమయం లేదని, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఇది ప్రజల ఉద్యమమని, ప్రతి ఒక్కరూ నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. యువతకు ముందుండే అవకాశం కల్పించాలని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని తిరిగి నిలబెట్టేందుకు యువతతో కలిసి బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 23న నిర్వహించే ప్రజా ర్యాలీల్లో పాల్గొని, దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ తరహా నిరసనలకు మద్దతు ఇవ్వాలని ఇండియా కూటమిలోని రాజకీయ పార్టీలను కోరారు.
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేసి, ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన వారందరి పేర్లను తిరిగి చేర్చాలని కోరారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టంలో చేసిన సవరణలను రద్దు చేయాలని, నిష్పక్షపాత ప్రక్రియ ద్వారా కొత్త ఎన్నికల సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలను సరిచేయడంతో పాటు, పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టి, ఎన్నికల సంస్కరణల ద్వారా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అధికారం ప్రజలదేనని, రాజ్యాంగమే అంతిమంగా విజయం సాధిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్రలు విఫలమవుతాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)