న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. జంతర్మంతర్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారంటూ వీరిద్దరితో పాటు మరో 12మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతిక్రమణ, అధికారిక ఆదేశాలను ధిక్కరించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై 14మందిపై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వారికి ఐదురోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిజెపికి చెందిన మరో నేత అజింక్య షిండే రూ. 5,000వ్యక్తిగత పూచీకత్తు, హామీ సమర్పించారని అన్నారు. ఆరు నెలల పాటు శాంతియుతంగా, సత్ప్రవర్తన కలిగి ఉంటానని అంగీకరించిన తర్వాత ఆయనను విడుదల చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఆదేశాన్ని ధిక్కరించడం, నేరం చేసే ఉద్దేశంతో ఇతరుల ఆవరణలోకి చొరబడటం, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలపై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్లోని సెక్షన్లు 223(ఎ), 332, 61(2) కింద మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. విధులు నిర్వహించకుండా ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడం, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, ఉమ్మడిగా పలువురు కలిసి నేరపూరిత చర్యలకు పాల్పడటం వంటి ఆరోపణలపై బిఎన్ఎస్లోని సెక్షన్లు 221, 115(2), 132, 121(1), 3(5) కింద పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో రెండవ ఎఫ్ఐఆర్ నమోదైంది.
మంగళవారం ఉదయం సిజెపి నేతలు సౌరవ్దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండే సహా 14మంది ప్రైవేట్ ప్రాంగణం మీదుగా జంతర్ మంతర్ చేరుకున్నారని, అక్కడ వారిని అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ, విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.








కామెంట్లు (0)