శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్బంధంతో నిరసనను అణచివేయలేరు : సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో

1 గంట క్రితం

cpim POLIT BUREAU
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 01:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నిర్బంధంతో కేంద్ర ప్రభుత్వం నిరసనను అణచివేయలేదని సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో స్పష్టం చేసింది. ఢిల్లీలో కొనసాగుతున్న విస్తృత అణచివేతను, అరెస్టులను ఖండిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా, భారీ స్థాయిలో ఓటు హక్కు కోల్పోవడానికి కారణమైన ఎస్‌ఐఆర్‌ ఉపసంహరణ, ఇతర ఎన్నికల సంస్కరణలను డిమాండ్‌ చేస్తూ నేడు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఢిల్లీ పోలీసులు ప్రయోగించిన విస్తృత అణచివేతను సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఢిల్లీలో కర్ఫ్యూ (ఇంటర్నెట్‌ నిలిపివేత, మెట్రో స్టేషన్ల మూసివేత, రవాణా వ్యవస్థల నిలిపివేత, ఇతర అణచివేత చర్యలు) ఉన్నప్పటికీ.. నిరసన తెలిపేందుకు ప్రజలు వీధుల్లోకి వచ్చారని పేర్కొంది. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిపిఐ(ఎం) సీనియర్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారని, వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి, పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ ప్రతిపక్ష‍ నేత పినరయి విజయన్‌, సీనియర్‌ నేత బృందాకారత్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎం.వి.గోవిందన్‌, విజయ రాఘవన్‌, అలాగే కేంద్ర కమిటీ సభ్యులు కె.కె.శైలజ, పి.కె.శ్రీమతి, థామస్‌ ఐజాక్‌, కె.ఎన్‌.బాలగోపాల్‌, పి. రాజీ, ఎంపి జాన్‌బ్రిట్టాస్‌లు ఉన్నారు.


ఇంద్రజిత్‌ గుప్తా రోడ్డులోని హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌ నుండి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, అరుణ్‌కుమార్‌, విజూకృష్ణన్‌, మరియంధావలే సహా ఎ.ఆర్‌.సింధు, లోకనాథన్‌ వంటి కేంద్ర కమిటీ సభ్యులతో కూడిన మరో బృందాన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టు అయిన వారిలో సీనియర్‌ నేత మాణిక్‌ సర్కార్‌ కూడా ఉన్నారు.


దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల పట్ల ప్రధాని మోడీప్రభుత్వం భయాందోళనకు గురవుతోందన్నది స్పష్టమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న ప్రజలను అణచివేత చర్యలతో నిలువరించలేమన్నది కూడా అంతే స్పష్టమని వెల్లడించింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి, నిఘా ఉంచినప్పటికీ ఈ నిరసనలను కొనసాగాయని తెలిపింది. తమ అధికారం, బలప్రదర్శనపై వ్యామోహంతో వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వం తమ తీవ్ర పిరికితనాన్ని, ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగించలేమని అసమర్థతను బయపెట్టుకుంటుందని విమర్శించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్