న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం తుపానుగా బలపడింది. ఈ తుపానుకు భారత్ ‘మురసు’ (అంటే యుద్ధ భేరీ లేదా ఢంకా లేదా నగారా అని అర్థం) తుపానుగా నామకరణం చేసింది. బంగాళాఖాతంలో ‘మురసు’ తుపాను ఏర్పడిందని, ఇది మంగళవారం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. ప్రస్తుతం తుపాను చెన్నైకి 560కిమీ, విశాఖపట్నానికి 660 కి.మీ, మచిలీపట్నానికి 640 కిమీ, నెల్లూరుకు 630కి.మీ, ఒంగోలుకు 680 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. సోమవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు -నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండి భావిస్తోంది. తుపాను ప్రభావంతో మరో మూడురోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే దక్షిణ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.







కామెంట్లు (0)