- సిఇసి కార్యాలయ ముట్టడికి ‘ఇండియా’ నేతల మార్చ్
- పార్లమెంటు మకర్‌ద్వార్ నుంచి ఆకాశవాణి భవన్ వరకు ర్యాలీ
- పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయింపు - రోజంతా ఉద్రిక్తత
- రాహుల్, జాన్ బ్రిట్టాస్ సహా ప్రతిపక్ష ఎంపిల అరెస్టు
- నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాల్లో కుక్కేసిన పోలీసులు
- మహిళా నేతలు, సీనియర్ ఎంపీలపైనా ఖాకీల క్రౌర్యం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపిలు ఎన్నికల కమిషన్ కార్యాలయం నిర్వాచన్ సదన్‌కు చేపట్టిన ర్యాలీతో దేశ రాజధాని దద్దరిల్లింది. మహిళా, వృద్ధ ఎంపిలపై సైతం పోలీసులు అమానుషంగా విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ నుంచి మంగళవారం ప్రారంభమైన మార్చ్ ఆకాశవాణి భవన్‌కు చేరుకోగానే పోలీసులు మూడు వరుసలలో బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఎంపిలు అక్కడే భైఠాయించారు. అక్కడి నుండి వారిని తొలగించడానికి పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల ప్రయత్నాలను ఎంపిలు ప్రతిఘటించారు. పోలీసులు విచక్షణారహితంగా విరుచుకు పడటంతో సిపిఎం ఎంపి ఎఎ రహీం వీపుపై గాయాలయ్యాయి. జాన్‌బ్రిట్టాస్, వి శివదాసన్, ఎఎ రహీం తదితరులను రోడ్డుపై ఈడ్చేసి, బస్సుల్లో కుక్కి అక్కడి నుండి తరలించారు. ఈ దశలో లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ బ్యారికేడ్లపైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అనంతరం ఆకాశవాణి భవన్‌లోకి ఆయనతో పాటు, ప్రియాంకగాంధీ మరికొందరు ఎంపిలు దూసుకెళ్లారు. అక్కడే రోజంతా భైఠాయించారు. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు పదేపదే ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జ్ఞానేష్ రాజీనామాచేయాలి,సేవ్ డెమోక్రసీ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. రాత్రి పొద్దు పోయిన తరువాత రాహుల్‌గాంధీతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. వీరిని ఉంచిన పోలీస్ స్టేషన్ వద్దకు ప్రియాంక గాంధీ తదితరులు చేరుకుని ఆందోళన చేశారు. ఈ సంఘటనలతో రోజంతా రాజధాని ఢీల్లీ దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, ఎస్‌పి, శివసేన, టిఎంసి, సిపిఐ(ఎంఎల్), నేషనల్ కాన్ఫెరెన్స్, కేరళ కాంగ్రెస్, జెఎంఎం, విసికె, ఐయుఎంఎల్, ఆర్ఎస్‌పి, బిజెడి తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు అమ్రారామ్, లోక్‌సభ, రాజ్యసభలో సిపిఎం పక్షనేతలు కె. రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, ఎంపీలు ఎ.ఎ రహీం, వి. శివదాసన్, ఎస్. వెంకటేశన్, జి. సచ్చిదానందం, సిపిఐ ఎంపీలు పి. సంతోష్‌కుమార్, పి.పి. సునీర్, ఎస్‌పి అధినేత అఖిలేష్ యాదవ్, టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ, ఎన్‌సిపి ఎంపీ సుప్రియా సూలే, ఎంపీ ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)