- పెట్రోల్‌లో 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్
- కేంద్రంపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ : పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న కేంద్ర లక్ష్యంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. “ఇ20 కాదు.. 420” అంటూ సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం ఏడు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల నుంచి సేకరించిన నమూనాలను గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షించగా, 14 నమూనాల్లో 11 నమూనాలకు 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ ఉన్నట్లు తేలిందని ఆయన విమర్శించారు. కొన్ని నమూనాల్లో ఇది 26శాతం నుంచి 31శాతం వరకు ఉందన్నారు. ఇండియన్ ఆయిల్ నమూనాలో 31.2 శాతం, హెచ్‌పిసిఎల్ నమూనాలో 30.5శాతం ఇథనాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. బిపిసిఎల్, నయారా, షెల్ వంటి సంస్థల నమూనాల్లోనూ పరిమితికి మించి ఉందన్నారు. కంపెనీల సొంత ల్యాబ్ నివేదికల్లో ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా పేర్కొనలేదని విమర్శించారు. అన్ని వాహనాలు అధిక ఇథనాల్ మిశ్రమానికి అనుకూలం కావని, దీనివల్ల మైలేజీ తగ్గడంతో పాటు మరమ్మతు ఖర్చులు పెరిగే అవకాశం ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. బంకుల్లో ఇథనాల్ శాతం వివరాలు వినియోగదారులకు తెలియజేయడం లేదని, ఇంధనంలో ఏమి కలిపారో తెలుసుకునే హక్కు వారికి ఉండాలని అన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన రాహుల్, నిర్దేశిత పరిమితి దాటిన కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రధానికి ఇప్పటికే విసిరిన బహిరంగ చర్చ సవాల్‌లో ఈ అంశాన్ని కూడా చేరుస్తానని తెలిపారు.







కామెంట్‌లు (0)