- ఎస్‌ఐఆర్‌లో భారీగా నకిలీ ఓట్ల చేర్పులు
- ఆపై తొలగించాలంటూ అప్పీళ్లు
- ఈ లోపే ఎన్నికలు..బిజెపి గెలుపు
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికల ముందుగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) అనేక అనుమానాలకు తావిచ్చింdrఇ. ఈ క్రమంలోనే తాజాగా మరో అంశం తెర మీదకు వచ్చింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా లక్షలాది నకిలీ ఓట్లకు చోటు కల్పించిన ఎన్నికల సంఘమే ఆ తర్వాత వాటిని తొలగించాలంటూ ఈ మేరకు నిమించిన ట్రిబ్యునల్ ముందు అప్పీలు చేసుకుంది. అయితే బూటకాన్నీ గుర్తించిన కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా..అప్పీలు చేసుకున్నందున అవి పరిశీలనలో ఉండగా తొలగించరాదంటూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఈ లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం, బిజెపి అధికారం చేజిక్కించుకోవడం ..సంఘ్ పరివార్ లక్ష్యం ఎన్నికల సంఘం ద్వారా విజయవంతమైంది. ద వైర్ కు అందిన సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ సమయంలో 16 లక్షలకు పైగా నకిలీ ఓట్లు చేర్చినట్లు అంచనా. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ తరువాత వివాదాలను పరిష్కరించడానికి ట్రిబ్యునల్‌ను సుప్రీంకోర్టు ఏర్పాచేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రిబ్యునల్‌కు అధ్యక్షత వహిస్తున్న కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, విశ్రాంత జడ్జీ ఇంద్రజిత్ చటర్జీ ఇసి తీరును ఎండగట్టారు. ట్రిబ్యునల్ ముందు ముర్షిదాబాద్‌లోని 11 నియోజకవర్గాల నుంచి 6,35,983 అప్పీళ్లు దాఖలైనట్లు చెప్పారు. ఇందులో 2.54 లక్షల అప్పీళ్లు (అంటే ప్రతి 10 అప్పీళ్లలో సుమారు నాలుగు) బెంగాల్ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ) దాఖలు చేసినవి. అలాగే ఇవన్నీ కూడా ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు తొలగించాలని కోరుతూ దాఖలు చేసినవి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 2.54 లక్షల ఓటర్లలో ఏ ఒక్కరు కూడా తమ పేర్లను ఓటర్ల జాబితాలో పునరుద్ధరించాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేయలేదు. అంటే వాళ్లు నిజమైన ఓటర్లు కాకపోవడం వలన తమ ఓట్లు పునరుద్ధరించాలని కోరలేదు.
అలాగే, ఈ ఏడాది సెప్టెంబర్ 16న కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ) పశ్చిమ బెంగాల్ ట్రిబ్యునల్ ముందు దాఖలైన అప్పీళ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వివరాల ప్రకారం మొత్తం 38,31,429 అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిలో ఓటర్ల జాబితాలో తమ పేరు చేర్చాలని కోరుతూ 22,21,118 అప్పీళ్లు దాఖలు కాగా, జాబితాలో ఉన్న ఓట్లకు వ్యతిరేకంగా 16,10,311 అప్పీళ్లు దాఖలయ్యాయి. అయితే ఈ ఓట్లకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లు వివరాలను సుప్రీంకోర్టుకు ఇసిఐ వెల్లడించలేదు. అంటే ఈ 16,10,311 అప్పీళ్లను కూడా బెంగాల్ రాష్ర్ట ఎన్నికల సంఘం దాఖలు చేసినవే. దీని ప్రకారం బెంగాల్ ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకంగా 16 లక్షలకు పైగా నకిలీ ఓట్లను జాబితాలో చేర్చింది. వీరంతా కూడా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎందుకంటే కేవలం కేవలం అప్పీలు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన, ఏ వ్యక్తిని కూడా ఓటు హక్కుకు దూరం చేయవద్దని ఈ ఏడాది ఏప్రిల్ 13న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల తరువాత బిజెపి అధికారంలోకి వచ్చింది.
అప్పీళ్లను పరిష్కరించడానికి 174 ఏళ్లు
అలాగే, ట్రిబ్యులన్ ముందు ఉన్న ఒక్క అప్పీలుపై విచారణ జరిపి, కారణాలతో కూడిన ఉత్తర్వు రాయడానికి కనీసం 30 నిమిషాలు పడుతుందని జడ్జీ ఇంద్రజిత్ చటర్జీ తెలిపారు. అంటే దీనివల్ల రోజుకు గరిష్టంగా 10 కేసులను మాత్రమే పరిష్కరించవచ్చని జస్టిస్ చటర్జీ చెప్పారు. ఈ 11 నియోజకవర్గాల్లోనూ సంవత్సరంలో ప్రతిరోజూ 10 కేసుల చొప్పున పరిష్కరిస్తే, పేరుకుపోయిన కేసులను పరిష్కరించడానికి దాదాపు 174 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. 6,35,983 అప్పీళ్లలో 6,34,156 అప్పీళ్లు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయని గుర్తు చేశారు. నవంబర్ 2 నుండి ట్రిబ్యునల్ న్యాయమూర్తి పదవి నుండి వైదొలగుతున్నట్లు జస్టిస్ చటర్జీ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటికే సెప్టెంబర్ 25వ తేదీన కొల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో తెలిపినట్లు చెప్పారు. సాల్ట్ లేక్‌లోని తన ఇంటి నుండి జోకాలోని ట్రిబ్యునల్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రతీ రోజూ సుమారు 70 కిలోమీటర్ల ప్రయాణం చేయల్సివస్తుందని తన లేఖలో ఆయన తెలిపారు. అయితే ట్రిబ్యునల్‌లో ఇలాంటి రాజీనామాలు కొత్తకాదు. మే నెలలో అప్పీలేట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి పదవికి కొల్‌కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)