న్యూఢిల్లీ : ప్రతిపక్షాలు, యువత ఆందోళనలపై కేంద్రం కక్షసాధింపుల చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీలోని ప్రముఖ జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం ప్రకటించారు. జంతర్ మంతర్‌కు బదులుగా మరో మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాలను సూచించారు. రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, సిబిడి గ్రౌండ్‌ను నిరసన వేదికలుగా వినియోగించాలని పోలీసులు వెల్లడించారు. ఆందోళనలు, ధర్నాల కోసం ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలించేందుకు ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ కమిటీని నియమించిందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా డీనోటిఫై చేస్తున్నామని అన్నారు. కొత్త వేదికల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి విధి విధానాలను త్వరలోనే జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
జంతర్ మంతర్‌పై ఆంక్షలు.. మోడీ, షాలపై కాంగ్రెస్ విమర్శలు
జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడంపై కాంగ్రెస్ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై విమర్శలు గుప్పించింది. శాంతియుత ప్రజా నిరసనలను అణచివేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి జంతర్ మంతర్ రోజువారీ బూస్టర్ డోస్‌లా పనిచేసే చారిత్రక ప్రదేశమని పేర్కొన్నారు. అక్కడ నిరసనలకు అవకాశం లేకుండా చేయడమంటే ప్రభుత్వ భయాందోళనకు సంకేతమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
పిరికి నియంత : అభిజీత్ దీప్కే
జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన వేదికగా గుర్తించే విధానాన్ని రద్దు చేస్తూయ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఖండించారు. "ఆ పిరికి నియంత జంతర్‌మంతర్‌ను ఇప్పటికే ఒక యుద్ధ క్షేత్రంగా మార్చేశారు. దీంతో , ఇది ఇకపై నిరసన వేదికగా ఉండదు" అని దిప్కే ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇకపై దేశమంతా జంతర్ మంతర్‌గా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.







కామెంట్‌లు (0)