న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం, ప్రజలు తనకు ఆశ్రయం కల్పించినందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు. 1975లో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో భారత్ తనకు అండగా నిలిచినట్లుగానే, ఇప్పుడు కూడా ఆదరించిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు వర్చువల్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
1975 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఘటనలో బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు, ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌తోపాటు తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో ఉండటంతో హసీనా, ఆమె చెల్లెలు రెహానా ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ వారికి ఆశ్రయం కల్పించారు.
ఆరేళ్ల అనంతరం 1981 మే లో హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి పరిణామాలను గుర్తుచేసుకున్న ఆమె, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అందిస్తున్న ఆశ్రయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
‘వారు నన్ను చంపవచ్చు.. అయినా తిరిగి వెళ్తా’ ....
డిసెంబర్ లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని హసీనా స్పష్టం చేశారు. అక్కడికి వెళ్లేందుకు తాను భయపడటం లేదని పేర్కొన్నారు. ‘‘వారు నన్ను చంపవచ్చు, హింసించవచ్చు లేదా అరెస్టు చేయవచ్చు. అయినప్పటికీ తిరిగి వెళ్లడం నా బాధ్యత’’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, డిసెంబర్‌లో ఏ తేదీన స్వదేశానికి వెళ్తారనే విషయాన్ని వెల్లడించలేదు. తనపై, తన మద్దతుదారులపై నమోదైన కేసుల విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరారు.








కామెంట్‌లు (0)