- సహకార సంఘంపై ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన
కొల్హాపూర్ : మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో రైతులు కదంతొక్కారు. సహకార సంఘంపై ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సోమవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. గోకుల్ డెయిరీ బోర్డులో మార్పులు చేయడాన్ని నిరసిస్తూ వేలాదిమంది పాల రైతులు తమ పశువులను తీసుకుని కొల్హాపూర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గోకుల్ డెయిరీగా అందరికీ చిరపరిచితమైన కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ బోర్డులో 25మంది సభ్యులుంటారు. వారిలో పాలక మహాయుతి సంకీర్ణ సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 12 నుండి 16కి పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ అయింది. ఆ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రైతులు ప్రదర్శన చేపట్టారు. రూ.500కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన సహకార సంస్థలకు ఐదుగురు సభ్యులను నామినేట్ చేయడానికి ప్రభుత్వానికి ఈ ఆర్డినెన్స్ అనుమతినిస్తోంది. అందులో నలుగురికి ఓటింగ్ హక్కులు వుంటాయి. ఈ చర్యను కాంగ్రెస్ నేతృత్వంలోని రాజర్షి సాహు షేట్కారి సంవిచారి అగధి తీవ్రంగా వ్యతిరేకించింది. అక్టోబరు 19న జరిగిన గోకుల్‌బోర్డు ఎన్నికల్లో అగధి 13సీట్లను గెలుచుకుంది. మరోవైపు మహాయుతిల మద్దతు కలిగిన కమిటీ 12సీట్లు గెలుచుకుంది.
కాంగ్రెస్ ఎంఎల్‌సి సతేజ్ పటేల్ నేతృత్వంలో ఆందోళనకారులు జరిపిన ఈ ప్రదర్శనలో నల్లజెండాలు, బ్యానర్లు చేబూని ప్రతిపక్ష నేతలు, లాయర్లు, రైతులు కూడా పాల్గొన్నారు. ఆ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో గెలుపొందిన ప్యానెల్ పిటిషన్ వేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సహకార సంస్థపై పట్టు కోసం నిబంధనలను మార్చారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజెపిని విమర్శించారు. పాల రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన తీర్పుపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు.







కామెంట్‌లు (0)