- బ్యాలెట్ పత్రాల విధానానికి తిరిగి వెళ్లాలి
- డిఎంకె ఎంపీల తీర్మానం
చెన్నై: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిఎంకె డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సందర్భంగా మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పక్కనపెట్టి, ఓటర్ల పేర్ల తొలగింపును ఆయన పర్యవేక్షించారని ఆరోపించింది. శనివారం పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డిఎంకె ఎంపీల సమావేశంలో ఈమేరకు తీర్మానించారు. ‘‘ఆయనను పదవి నుంచి తొలగించి, తగిన విచారణ జరపాలి’’ అని సమావేశం ఆమోదించిన తీర్మానం పేర్కొంది.
తిరిగి బ్యాలెట్ పేపర్లు..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఇవిఎంలు) నమోదైన ఓట్లకు, వివిప్యాట్ స్లిప్పులకు మధ్య తేడాలున్నాయన్న ఆరోపణల కారణంగా ఇవిఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తాయని డిఎంకె తెలిపింది. బ్యాలెట్ పత్రాల విధానానికి తిరిగి వెళ్లాలని స్పష్టం చేసింది. ‘‘అందుకే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిఎంకె డిమాండ్ చేస్తోంది. బ్యాలెట్ పేపర్ విధానానికి తిరిగి వెళ్తేనే ఎన్నికలపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించగలం’’ అని పార్టీ తెలిపింది. భారత ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేయడంలో విఫలమవుతోందని, దాంతో ఎన్నికలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.
ఎస్ఐఆర్ను రద్దు చేయాలని రాష్ట్రపతికి వినతి...
అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్ఐఆర్ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలని పార్టీ నిర్ణయించింది. భవిష్యత్ ఎన్నికలను ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాల ఆధారంగానే నిర్వహించాలని కూడా డిమాండ్ చేసింది. ‘‘ఎస్ఐఆర్ ఓటర్ల హక్కులను కాపాడాలి తప్ప, ఓటు హక్కును కోల్పోయేలా చేయకూడదు. పేర్ల చేర్పులు, తొలగింపులకు తగినంత సమయం ఇవ్వాలి’’ అని పార్టీ పేర్కొంది. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిర్వహించిన నిరసనలకు కూడా డిఎంకె మద్దతు ప్రకటించింది.
కాంగ్రెస్ నిర్వహించిన నిరసనల కన్నా ఇవే ఎక్కువ ప్రభావం చూపాయని పేర్కొంది. అలాగే, ‘‘నిరసనల ప్రభావం చూసి కాంగ్రెస్ భయపడింది. మొదట్లో ప్రేక్షకపాత్ర వహించినా, ఉద్యమాలు ఊపందుకోవడంతో ఒత్తిడికి గురైంది. ఇతరుల భుజాలపై ఎక్కి ప్రయాణించి, ఆ తర్వాత వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్ చరిత్ర తెలిసినవారికి కొత్త కాదు. తమిళనాడు, కేరళంల్లో ఎస్ఐఆర్పై చర్చకు ఆ పార్టీ సిద్ధంగా లేదు’’ అని డిఎంకె విమర్శించింది.







కామెంట్లు (0)