న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. 2016లో చేపట్టిన నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల రద్దు రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తోందని మండిపడింది. ఈ రెండు చర్యలకూ ప్రధాని మోడీయే బాధ్యుడని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేశ్ విమర్శించారు. నోట్ల రద్దు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 2016లో పెద్ద నోట్ల రద్దు ఓ విపత్తు అని, పదేళ్ల తర్వాత అది ఘోర వైఫల్యంగా నిరూపితమైందంటూ ఓ మీడియా నివేదికకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆయన పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. "నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. ఓట్ల రద్దు రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తోంది. ఈ రెండూ ప్రధాని మోడీ చేసిన పనులే" అని వ్యాఖ్యానించారు.
కాగా, 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అప్పటివరకు చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నల్లధనం నిర్మూలన, నకిలీ కరెన్సీ అరికట్టడం, ఉగ్రవాదానికి ఆర్థిక సహకారాన్ని నిలువరించడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని, సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలను సాధించడంలోనూ నోట్ల రద్దు విఫలమైంది.
ప్రతి ఏడాది నవంబర్ 8న నోట్ల రద్దు వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు చేయడం కొనసాగిస్తోంది. ఈసారి 'నోట్ల రద్దు'తో పాటు 'ఓట్ల రద్దు' అంశాన్ని ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వంపై రాజకీయంగా విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేసింది.








కామెంట్లు (0)