శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సౌరవ్‌దాస్‌ పౌరసత్వంపై పిల్‌.. కేంద్రానికి మద్రాస్‌ హైకోర్టు నోటీసులు

1 గంట క్రితం

saurav das
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) సహ వ్యవస్థాపకుడు సౌరవ్‌దాస్‌ పౌరసత్వంపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. ఆయన పౌరసత్వంపై విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి, జస్టిస్‌ జి.అరుల్‌ మురుగన్‌లతో కూడిన మొదటి డివిజన్‌ బెంచ్‌ కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఎ)ను శుక్రవారం ఆదేశించింది. ఒకవేళ ఆయన భారతీయ పౌరుడు కాదని నిర్థారణైతే .. ఆయన పాస్‌పోర్ట్‌, ఆధార్‌ కార్డులను రద్దు చేయాలని ఆదేశించింది. సౌరవ్‌దాస్‌కు నోటీసు జారీ చేయాలని, అలాగే ఆయన ఎక్స్‌ , ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను బ్లాక్‌ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆర్‌. గణేష్‌కుమార్‌ పిల్‌ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు జడ్జీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని కూడా ఆ పిల్‌లో కోరారు.


దాస్ అసలు పేరు యోగేష్ శర్మ” అని, ఆయనకు “నేపాల్‌తో సంబంధాలు” ఉన్నాయని తన న్యాయవాది బి.జగన్నాథ్‌ ద్వారా దాఖలైన అఫిడవిట్‌లో ఆర్‌.గణేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ వివరాలను దాచిపెట్టి, భారతదేశంలో మోసపూరితంగా ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డులను పొందారని ఆయన ఆరోపించారు. కీలకమైన వాస్తవాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని ఆరోపించారు. సౌరవ్‌దాస్‌ను ప్రతివాది 06 గా పేర్కొంటూ అతనికి సరైన ఉపాధి లేదని, నిరుద్యోగి అని పేర్కొన్నారు. కానీ తనను తాను సిజెపి ప్రతినిధిగా చెప్పుకుంటున్నారని అఫిడవిట్‌లో ఆరోపించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా అవాస్తవ, నిరాధారమైన ఆరోపణలతో యువతలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. సౌరవ్ దాస్ అనే వ్యక్తి వద్ద ఎన్ని పాస్‌పోర్టులు ఉన్నాయో ఎవరికీ తెలియదని, దేశ ప్రయోజనాల దృష్ట్యా దీనిపై లోతైన విచారణ జరగాలని పేర్కొన్నారు. దాస్ న్యాయవ్యవస్థను విమర్శించిన అనేక సోషల్ మీడియా పోస్టులను గురించి మాట్లాడుతూ.. ఆయన కచ్చితంగా విదేశాల నుండి నిధులు పొందుతూ ఉండాలని, విచారణ జరిపితేనే ఆయన నిధుల మూలాలు బయటపడతాయని పేర్కొన్నారు. పాలకవర్గంపై గందరగోళం, అరాచకం, అసంతృప్తి, ద్వేషాన్ని సృష్టించే ఉద్దేశ్యంతోనే సౌరవ్‌దాస్‌ తన సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించారని పిటిషనర్ ఆరోపించారు. ఆయన ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ కూడా న్యాయవ్యవస్థ దుర్వినియోగం గురించే ఉందని ఆరోపించారు. ఇది తీవ్రవాద వామపక్షవాదులను ప్రశంసిస్తూ, తీవ్ర కమ్యూనిస్ట్ భావజాలాన్ని కలిగి ఉందని ఆరోపించారు. ఇవి యోగేష్ శర్మ అలియాస్‌ దాస్‌ ఒక కమ్యూనిస్ట్ అనే వాస్తవాన్ని స్పష్టం చేస్తుందని ఆరోపించారు. విద్యా సంస్కరణల పేరుతో జరిగిన నిరసనల నేపథ్యంలో, జంతర్ మంతర్ నిరసన సందర్భంగా ఆయన 'పార్లమెంటుపై దాడి చేయాలని' పిలుపునిచ్చారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్