బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గనులు ప్రభుత్వరంగంలో ఉంటేనే పురోగతి

10 జులై, 2026

sss
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 10:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- తొలి ప్రభుత్వ బంగారు గని ప్రారంభిస్తూ బుర్కినా ఫాసో మంత్రి గౌబా

ఒగాడుగు : గనులు ప్రభుత్వరంగంలో ఉంటేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని బుర్కినా ఫాసో ఇంధన, గనులు, క్వారీల శాఖా మంత్రి యాకూబా జాబ్రే గౌబా అన్నారు. ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో బంగారు గనులను స్వాధీనం చేసుకోవాలనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తొలి ప్రయత్నంగా గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ సంస్థ (ఎస్‌ఒపిఎఎంఐబి)కు మైనింగ్‌‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇంధన, గనులు, క్వారీల శాఖా మంత్రి యాకూబా జాబ్రే గౌబా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ బుర్కినా ఫాసో మైనింగ్ విధానంలో ఒక ప్రధాన మార్పును తీసుకువస్తుందని, దీంతో ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టుదారులపై ఆధారపడకుండా ప్రత్యక్ష పారిశ్రామిక నిర్వాహకురాలిగా మారుతుందని తెలిపారు. ఈ సహజ వనరులను ప్రభుత్వ నియంత్రించేందుకు, ఆర్థిక సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేసుకునే దిశగా బుర్కినా ఫాసో ముందడుగు వేసిందని పలువురు భావిస్తున్నారు. యాడ్గా ప్రాంతంలోని యాకో మున్సిపాలిటీలో వున్న ఈ గని కార్యకలాపాలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్‌ఒపిఎఎంఐబి నిర్వహిస్తుంది. 15 ఏళ్ల కాలంలో 10.77 మిలియన్ల టన్నుల ఖనిజం నుండి 7.27 టన్నుల బంగారాన్ని వెలికితీయడమే లక్ష్యమని అధికారులు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని, విదేశీ మారకద్రవ్యం ఆర్జించడానికి దోహదపడుతుందని సంస్థ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్టుకు సుమారు 39 మిలియన్ల అమెరికన్ డాలర్లు పెట్టుబడి అవసరం కాగా, డివిడెండ్లను మినహాయించి, దీని ద్వారా దాదాపు 66 మిలియన్ల అమెరికా డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. బుర్కినా ఫాసోకు ప్రధాన ఎగుమతుల్లో బంగారం కీలకమైంది. ఈ బంగారు గనులపై సామ్రాజ్యవాద శక్తుల ప్రాబల్యం పెరిగిపోతోంది. వ్యూహాత్మక పరిశ్రమల్లో ప్రభుత్వ పాత్రను పెంచడానికి ఇటీవల కాలంలో అధ్యక్షుడు ఇబ్రహీం ట్రారోర్‌ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చర్యలను తీసుకుంటున్నారు. పొరుగు దేశాలైన మాలి, నైజర్‌ ‌దేశాలతో పాటూ బుర్కినాఫాసో కూడా ఇటీవల వ్యూహాత్మక ఖనిజ వనరులపై ప్రభుత్వ నియంత్రణను పెంచుతుంది. బంగారం ఉత్పత్తి నుండి ప్రధానంగా లభించే ప్రయోజనాలు దేశాభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్