న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీలో పీపుల్స్ మార్చ్ ప్రారంభమైంది. సంయుక్త కిసాన్ మార్చ్ (ఎస్‌కెఎం) సహా పలు రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన 'పీపుల్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్' కూటమి ఈ మార్చ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రైతులు, కార్మికులు, యువత, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు జాతీయ జెండాను చేబూని మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న బంగ్లా సాహిబ్ గురుద్వారా నుండి పటేల్ చౌక్ సమీపంలోని ప్రధాన ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ఈ మార్చ్ చేపట్టనున్నారు. ఈ నిరసనకు క్రాంతికారి యువ సంఘటన్ (కెవైఎస్), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) తమ మద్దతును ప్రకటించాయి. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ నుండి కూడా కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల నుండి తొలగించిన వారి ఓటు హక్కులను పునరుద్ధరించాలని, జ్ఞానేష్ కుమార్‌ను తొలగించి, ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
సెంట్రల్ ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) సిబ్బందిని భారీ సంఖ్యలో మోహరించారు. నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మోహరించిన 273 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) కంపెనీల నియామక కాలాన్ని కేంద్ర హోం శాఖ పొడిగించింది. సిఎపిఎఫ్‌ను అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. ఈ నెల ప్రారంభంలో సిజెపి చేపట్టిన నిరసనల సమయంలో ఈ బలగాలను కేంద్రం ఢిల్లీకి తరలించింది. బంగ్లా సాహిబ్ గురుద్వారా, జంతర్ మంతర్ సమీపంలో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు వాహనాలను మళ్లించనున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.







కామెంట్‌లు (0)