శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒబిసి క్రిమీ లేయర్‌ తీర్పు గతకాలానికి వర్తించదు : సుప్రీంకోర్టు

1 గంట క్రితం

SC clarifies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 12:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఒబిసి క్రిమీ లేయర్‌ వర్గీకరణకు సంబంధించి 2026 మార్చి 11న ఇచ్చిన తీర్పు గతకాలానికి వర్తించదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. 1993 నాటి కార్యాలయ మెమోరాండం ప్రకారం.. తల్లిదండ్రుల వేతన, వ్యవసాయ ఆదాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒబిసి నాన్‌ క్రిమీ లేయర్‌ (ఒబిసి -ఎన్‌సిఎల్‌) హోదాను నిర్ణయించాలన్న తీర్పులోని ప్రాతిపదికను గత నియామకాలకు వర్తింపజేయబోమని పేర్కొంది. అయితే, క్రిమీ లేయర్‌ హోదాను నిర్ణయించేందుకు ఏకరీతి విధానాన్ని రూపొందించేందుకు రెండేళ్ల సమయం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 2025 బ్యాచ్‌ అభ్యర్థుల సర్వీసుల కేటాయింపు మాత్రం మార్చి 2026 తీర్పుకు అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేసింది. మార్చి 11న ఇచ్చిన తీర్పును గతకాలానికి వర్తింపజేస్తే నియామకాలు, సర్వీసుల కేటాయింపులు, కేడర్‌ కేటాయింపులు, సీనియారిటీ, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఒబిసి రిజర్వేషన్ల అమలుపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని కేంద్రం కోర్టుకు తెలిపింది. లక్షలాది మంది అభ్యర్థులు, ఉద్యోగులపై ప్రభావం చూపడంతో పాటు పరిపాలనలోనూ గందరగోళం ఏర్పడుతుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ప్రకారం తీర్పును భవిష్యత్తుకు మాత్రమే వర్తించేలా ప్రకటించాలని కోరింది. 2012 నుంచి సర్వీసుల కేటాయింపులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్రం తరఫున న్యాయవాది భాటి తెలిపారు. గతకాలపు పునఃకేటాయింపులు ప్రస్తుత సీనియారిటీ, గ్రేడేషన్‌పై ప్రభావం చూపుతాయని, రైల్వేలు, బ్యాంకులు, పోస్టల్‌ , పారామిలిటరీ సర్వీసుల్లో నియామకాలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. తీర్పు వెలువడిన తర్వాత కొనసాగుతున్న పరీక్షలు, నియామక ప్రక్రియలపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. క్రిమీ లేయర్‌ వర్గీకరణలో తలెత్తిన వివక్షను సరిదిద్దేందుకు కొత్త విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వానికి తగిన సమయం అవసరమని ఆమె వాదించారు. అయితే, అభ్యర్థుల తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది పి. విల్సన్‌ కేంద్రం అభ్యర్థనను వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పును ఆలస్యం చేయడం లేదా దాని అమలును అడ్డుకోవడం కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ (డిఒపిటి) కోర్టు ఆదేశాలు, పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు, 1993 నాటి నిబంధనలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. అర్హులైన ఒబిసి అభ్యర్థులకు న్యాయం చేసేందుకు అదనపు పోస్టులను సృష్టించవచ్చని సూచించారు.


సరిగాలేని క్రిమీ లేయర్‌ వర్గీకరణ కారణంగా సర్వీసుల కేటాయింపుల్లో అన్యాయానికి గురైన అర్హులైన ఒబిసి-ఎన్‌సిఎల్‌ అభ్యర్థులకు సర్దుబాటు కల్పించేందుకు ఆరు నెలల్లోగా సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించాలని మార్చి తీర్పులో సుప్రీంకోర్టు డిఒపిటిని ఆదేశించింది. 1993 నాటి కార్యాలయ మెమోరాండం ప్రకారం, ఒబిసి అభ్యర్థులు క్రిమీ లేయర్‌ పరిధిలోకి వస్తారా లేదా అన్నది నిర్ణయించేటప్పుడు తల్లిదండ్రుల వేతన, వ్యవసాయ ఆదాయాలను మినహాయించే విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. అయితే, 2004లో ప్రభుత్వం జారీ చేసిన స్పష్టీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్‌యు), బ్యాంకులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే తల్లిదండ్రుల వేతనాలను క్రిమీ లేయర్‌ నిర్ణయంలో పరిగణనలోకి తీసుకున్నారు. అదే సమయంలో సమాన హోదాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పిఎస్‌యు ఉద్యోగుల పిల్లలు క్రిమీ లేయర్‌ పరిధిలోకి వెళ్లి ఒబిసి రిజర్వేషన్‌ ప్రయోజనాలకు అనర్హులవుతుండగా, సమాన హోదాలోని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఆ మినహాయింపు లభించింది. ఈ విధమైన వర్గీకరణ సమాన హోదాల్లో పనిచేసే ఉద్యోగుల మధ్య వివక్షకు దారితీస్తుందని మార్చి తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. పిఎస్‌యు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వేరుగా చూడటం రాజ్యాంగ విరుద్ధమైన వివక్షకు దారితీస్తుందని స్పష్టం చేసింది. క్రిమీ లేయర్‌ నిర్ణయం కేవలం కుటుంబ మొత్తం వేతన ఆదాయంపై కాకుండా సామాజిక హోదాపైనా ఆధారపడి ఉండాలని పేర్కొంది. పిఎస్‌యు ఉద్యోగుల పిల్లలను కేవలం వేతనాలను యాంత్రికంగా కలిపి క్రిమీ లేయర్‌ పరిధిలోకి నెట్టివేసి ఒబిసి రిజర్వేషన్‌ ప్రయోజనాలను నిరాకరించరాదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్