కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస ఎన్‌కౌంటర్లు కలకలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో అత్యాచారం, హత్య కేసులో నిందితుడు మంగళవారం ఎన్‌కౌంటర్‌లో మరణించగా, కొన్ని గంటల వ్యవధిలోనే ముర్షిదాబాద్‌లో బిజెపి కార్యకర్త హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆగస్టు 28న బిజెపి కార్యకర్త సుజిత్ మోండల్ హత్యకు గురైన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సమౌల్ షేక్ మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో ముర్షిదాబాద్ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించాడు. ఈ ఘటనకు సుమారు 12 గంటల ముందు ఉత్తర 24 పరగణాల జిల్లా గైఘాటాలో ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రహ్లాద్ దాస్ కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సుజిత్ మోండల్ హత్య కేసులో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం సీఐడీ అధికారులు సమౌల్ షేక్‌ను సంషేర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధూలియాన్‌కు తీసుకెళ్లినట్లు జంగీపూర్ పోలీస్ జిల్లా ఎస్పీ సురీందర్ సింగ్ తెలిపారు. ఈ సమయంలో సమౌల్ షేక్ ఓ పోలీసు అధికారి వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడని, దీంతో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు మరణించాడని వివరించారు. ఈ ఘటనపై సీఐడీ అధికారులు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
బీడీ కార్మికుడైన బిజెపి కార్యకర్త సుజిత్ మోండల్ ఆగస్టు 28న కిడ్నాప్‌కు గురయ్యాడు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన మృతదేహం ముక్కలుగా లభ్యమైంది. ఈ కేసులో సమౌల్ షేక్, తజ్కిరా బీబీ, జానీ షేక్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదమే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. నిందితుల్లో ఒకరైన సమౌల్‌షేక్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు నెలల్లో మూడు ఎన్‌కౌంటర్లు జరగడం గమనార్హం. రెండు నెలల క్రితం దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)