ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు!

1 రోజు క్రితం

kharge
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 10:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో: మహిళా రిజర్వేషన్‌ ‌సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుల కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని సమాచారం. ఈ బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ప్రత్యేక సమావేశాలను మోడీ ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించనుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న లోక్‌సభలో ఈ బిల్లులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మరోసారి బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చి ఆమోదం పొందేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం డిఎంకెతో పాటు కొన్ని చిన్న పార్టీలతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకున్న డిఎంకె మద్దతును కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారు. 22 మంది ఎంపిలున్న డిఎంకె, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీల్లో ఒకటి. మరికొన్ని చిన్న పార్టీలతోనూ బిజెపి చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిసినప్పటికీ, వాటికి అధికారికంగా ప్రొరోగేషన్‌ (సమావేశాల ముగింపు ప్రకటన) ఇవ్వలేదు. కాబట్టి ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈ నెల 26, 27 తేదీల్లో పార్లమెంటు ప్రాంగణంలోని సంవిధాన్‌ సదన్‌లో 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.

అఖిలపక్షం నిర్వహించాలి : ప్ర‌ధాని మోడీకి ఖర్గే లేఖ

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)పై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త విధానాలపై పార్లమెంటులో చర్చ జరగడానికి ముందే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోడీకి ఖర్గే లేఖ రాశారు. విస్తృత ప్రభావం చూపే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో బలవంతంగా ఆమోదింపజేయడానికి మరోసారి ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడినప్పటికీ ఇంకా అధికారికంగా ప్రొరోగ్‌ చేయలేదని, ఈ పరిస్థితి అసాధారణమైనదని ఖర్గే తన లేఖలో తెలిపారు. డీలిమిటేషన్‌పై రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఇప్పటికే మూడుసార్లు ప్రధానమంత్రికి లేఖలు రాసినట్లు ఖర్గే తెలిపారు. ఇప్పుడు నాలుగోసారి ఇదే విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న కొత్త విధానాలపై రాజకీయ పార్టీలు తమలో తాము, ఇతర పార్టీలతో పాటు సంబంధిత భాగస్వాములతో చర్చించుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలని ఖర్గే సూచించారు. విస్తృత ప్రభావం చూపే రాజ్యాంగ సవరణలను తగిన సంప్రదింపులు లేకుండా ముందుకు తీసుకెళ్లడం సరికాదని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్