- సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్
- జంతర్ మంతర్ వద్ద అరెస్టులకు ఖండన
న్యూఢిల్లీ : బిజెపి ఎన్నికల కార్యకలాపాల కోసం భారత ఎన్నికల కమిషన్‌ను బ్యాక్ ఆఫీసుగా మార్చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం యువత, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వందలాదిమందిని నిర్బంధించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో పనిచేసే ఢిల్లీ పోలీసులు ఈ ఆందోళన సందర్భంగా మొత్తంగా నగరాన్ని దుర్బేధ్యమైన కోటగా మార్చేశారు. జంతర్ మంతర్ వైపు వెళుతున్న ఎవరినైనా నిర్బంధించారు. జంతర్ మంతర్ వద్ద ఏ రకమైన ఆందోళనలకు అనుమతినివ్వకుండా నిరాకరించడం ద్వారా రాజ్యాంగం హామీ కల్పించిన, నిరసన తెలియచేసే ప్రజాస్వామిక హక్కును కుదించడానికి వారు ప్రయత్నించారని సిపిఎం విమర్శించింది. పోలీసులు అంతలా ప్రయత్నాలు చేసినా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర వివిధ విద్యార్ధి, యువజన సంఘాల నేతృత్వంలో వందలాదిమంది యువత, విద్యార్ధులు పోలీసుల దౌర్జన్యాలను, బారికేడ్లను ఎదుర్కొంటూ జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు. ఆందోళనకారులపై పోలీసులు దారుణంగా చేయి చేసుకుంటూ, వారిని బస్సుల్లోకి తోసేశారు. ఈ క్రమంలో అనేకమందికి గాయాలయ్యాయి. యువత పోలీసు చర్యలను తీవ్రంగా ప్రతిఘటించడంతో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులకు రెండు గంటలు పైగానే పట్టిందని పొలిట్‌బ్యూరో ప్రకటన పేర్కొంది.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, సిపిఎం నేత బృందా కరత్‌లతోపాటూ డివైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి హిమగ్‌నరాజ్ భట్టాచార్య, డివైఎఫ్‌ఐ అధ్యక్షులు, ఎంపి ఎ.ఎ.రహీమ్, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు ఆదర్శ్ ఎం.సాజి, ఎస్‌ఎఫ్‌ఐ జాయింట్ సెక్రటరీ, జెఎన్‌యుఎస్‌యు మాజీ అధ్యక్షులు అయిషీ ఘోష్ సహా పలువురు ఇతర నేతలను నిర్బంధించారు.
బిజెపి ప్రభుత్వ హయాంలో, ప్రజాస్వామ్య హక్కులను నిరంకుశంగా కుదిస్తున్నారు. ఆందోళనలు జరిపేందుకు నిర్దేశించిన స్థలమైనా జంతర్ మంతర్ వద్ద కూడా ఆందోళనలు చేపట్టడానికి అనుమతులను నిరాకరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత అసహనంగా మారిందో అర్ధమవుతోందని పొలిట్ బ్యూరో పేర్కొంది.
అన్నిరకాల ఆంక్షలను ధైర్యంగా ఎదుర్కొని నిరసన తెలియచేయడానికి వచ్చిన యువత, విద్యార్ధులు, పెద్ద సంఖ్యలో ప్రజలను సిపిఎం అభినందించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, భారత ఎన్కిల కమిషన్ వంటి ప్రభుత్వ సంస్థల తటస్థతను కొనసాగించేందుకు ఈ ఉద్యమం కొనసాగుతుందని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా కొనసాగుతున్న ఈ ఆందోళనను బలోపేతం చేయాలని పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తక్షణమే తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని, అదుపులోకి తీసుకున్న ఆందోళనకారులందరినీ విడుదల చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.







కామెంట్‌లు (0)