- ఎఫ్ఆర్టితో ఉన్నత విద్యారంగానికి ముంచుకొస్తున్న ముప్పు
- సంస్థల ప్రతిష్ట మసకబార్చే వ్యూహం
- నిధులకు, నియామకాలకు గండం
న్యూఢిల్లీ : దేశంలో ప్రతిష్టాత్మకమైన సాంకేతిక విద్యాసంస్థలంటే గుర్తొచ్చేది ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ ఇవే కదా! ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకే ముప్పు ముంచుకొచ్చింది. ఫైనాన్షియల్ రొబుస్ట్నెస్ టెస్ట్ (ఎఫ్ఆర్టి) పేరిట కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఆర్థక అర్హత పరీక్ష విధానమే దీనికి కారణం. ఈ విధానం ప్రకారం ప్రైవేటు నిధులను సమీకరించే సామర్థ్యాన్ని బట్టి సంస్థలకు ప్రత్యేక ఆర్థిక, పరిపాలనా అధికారాలను కల్పించనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలే ప్రతిష్టాత్మక సంస్థలకు మరణశాసనాలుగా మారుతాయన్న ఆందోళన విద్యావేత్తలలో వ్యక్తమవుతోంది. ఆ నిబంధనల ప్రకారం ఐఐటిల స్థాపన కాలాన్ని బట్టి మూడు విభాగాలుగా వర్గీకరించారు. 25 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సంస్థలు ‘ఎ’ విభాగంలోకి వస్తాయి. 15నుండి 25 ఏళ్ల సంస్థలు ‘బి’ విభాగంలోకి, 15 ఏళ్లలోపు సంస్ధలు ‘సి’ విభాగంలోకి వస్తాయి,
ఆందోళన ఎందుకు ?
నిబంధనల ప్రకారం ‘ఎ’ విభాగంలో ఉన్న ఐఐటిలు మూడేళ్ల కాలంలో కేంద్ర విద్యాశాఖ నుండి పొందిన మొత్తం గ్రాంట్లలో 95 శాతాన్ని ప్రైవేటుగా సమకూర్చుకోవాలి. ‘బి’ కేటగిరిలో ఉన్న ఐఐటిలు 50శాతాన్ని, ‘సి’ కేటగిరిలో ఉన్న సంస్థలు వేతన గ్రాంట్లలో (మొత్తం గ్రాంట్లు కాదు) 50 శాతాన్ని ప్రైవేటుగా సమకూర్చుకోవాల్సిఉంది. అలా సమకూర్చుకోగలిగిన సంస్థలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఇస్తామని, బోధన, బోధనేతర రంగాల్లో ఒక స్థాయి ఉద్యోగాల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగ నియమాకాలకు అనుమతి ఇస్తామని ఈ ఏడాది సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. 1951లో ఐఐటి ఖరగ్పూర్ ఏర్పాటయ్యింది. ఐఐటి బాంబే (1958) ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ (1959), ఐఐటి ఢిల్లీ 1961లో ఏర్పాటయ్యాయి, ఈ సంస్థలన్నీ ఏర్పాటై 25 ఏళ్లు దాటడంతో నూతన నిబంధనల ప్రకారం ‘ఎ’ కేటగిరి కిందకు వస్తాయి. అంటే, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులలో 95శాతం మొత్తాన్ని ఈ సంస్థలు ప్రైవేటుగా సమకూర్చుకోవాల్సిఉంది. ఈ నిబంధనే ఇప్పుడు ఆందోళనకు కారణంగా మారింది.
మసకబారనున్న ప్రతిష్ట!
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఐఐటి ఢిల్లీ 2024–25లో కేంద్ర విద్యాశాఖ నుంచి సుమారుగా రూ.1,046.84 కోట్ల గ్రాంట్లు పొందింది. దీనిలో 95 శాతం అంటే రూ.994.5 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. ఐఐటి కాన్పూర్ అదే ఏడాది ‘ఐఐటిలకు మద్దతు’ పథకం కింద రెవెన్యూ, మూలధన గ్రాంట్లు కలిపి రూ.787.31 కోట్లు పొందింది. ఈ మొత్తంలో 95 శాతం సుమారు 748.90 కోట్లు! ఇది ఒక ఏడాది గణాంకాలు మాత్రమే. నిబంధనల ప్రకారం వాస్తవ అర్హతను మూడు ఆర్థిక సంవత్సరాల గణాంకాల ప్రాతిపదికన లెక్కిస్తారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరగనుంది. అంత పెద్ద మొత్తంలో ప్రైవేటు రంగంనుండి నిధులను ఎలా సమీకరించాలన్నదే ఇప్పుడు సమస్య! సమీకరించడంలో విఫలమైతే ప్రత్యేక అధికారాలు ఉండవు! అంటే నిధుల కోసం, నియామకాల కోసం ప్రభుత్వం వైపు చూడాల్సివస్తుంది! ఒకవేళ అంతభారీ మొత్తాన్ని సమీకరించడంలో విజయవంతమైతే దానిని సాకుగా చూపి భవిష్యత్లోనూ నిధుల కోసం అదే పద్దతిని అమలు చేయాలని కేంద్రం సూచించే ప్రమాదం ఉంది. అంటే నిధులు సమకూర్చే బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుని నిధుల కోసం ప్రైవేటు రంగాన్ని దేబిరించిల్సిన దుస్థితి ప్రతిష్టాత్మక సంస్థలకు పట్టించనుంది.
ఎవరి కోసం...?
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ప్రతిష్టను మరింతగా పెంచకపోయినా, ఉన్న విలువలను కాపాడటం ప్రభుత్వాల కనీస బాధ్యత. అది జరగాలంటే అవసరమైన ఆర్థిక వనరులను ఇవ్వడంతో పాటు పరిశోధనా సామర్థ్యం, బోధనా ప్రమాణాలు ఏమాత్రం తగ్గకుండా చూడాలి. దీనికోసం సిబ్బంది అవసరాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి భిన్నంగా ప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యం! ఉద్యోగ నియమాకాలు నిలిపివేయడం వంటి కుటిల విన్యాసాలకు కేంద్రం దిగడం వెనుక విద్యారంగాన్ని మరింతగా ప్రైవేటీకరించాలన్న ఆలోచనే కారణమన్న అభిప్రాయం వినపడుతోంది. నరేంద్రమోడీ ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యావిధానంలో ప్రైవేటు విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించిన విషయం తెలిసిందే. గుర్తింపు, ప్రమాణాలు సాధించిన విద్యాసంస్థలకు స్వతంత్ర పాలన, నియామకాలు, విద్యా నిర్ణయాల్లో అధిక స్వేచ్ఛ కల్పించే దిశగా మార్పులను కూడా ఆ విధానం ప్రతిపాదించింది. ప్రైవేటు సంస్థలు ప్రపంచస్థాయి బోధన, పరిశోధన సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రత్యేక హోదా కల్పించే పథకాన్ని కూడా కేంద్రం అమలు చేస్తోంది. త్రిపుల్ ఐటిలో 20 సంస్థలను ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. ఐఐటిల విషయాని కొస్తే ఇవి కేంద్ర ప్రభుత్వ అధికారిక ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ చట్టం, 1961 ప్రకారం, ఏర్పాటయ్యాయి. ఇవి జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థలు. ప్రైవేటు సంస్థ ఐఐటిని పెట్టాలని భావిస్తే పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రతిష్టాత్మక సంస్థలను మసకబార్చిన తరువాత, రాజు తలుచుకుంటే అడ్డేముంటుంది? ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వంటి అడ్డదారులు ఉన్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిలయన్స్ జియో, మణిపాల్, బిట్స్ పిలాని వంటి ప్రైవేటు సంస్థలు ఉన్నత విద్యారంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
నిధుల రాక ఎలా ఉంది?
నీతి ఆయోగ్ 2026లో ప్రచురించిన వివరాల ప్రకారం ఐఐటిలలో పరిశోధనలకు సకాలంలో నిధులు విడుదల కావడం లేదు. ప్రాజెక్టుకు ఆమోదం లభించిన తర్వాత నిధుల విడుదలకు మూడు నుంచి ఆరు నెలలు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. దీంతో పరిశోధన కార్యకలాపాలు, ఫెలోషిప్ల చెల్లింపులకు అంతరాయాలు ఏర్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. మరోవైపు, 2024లో ఐఐటి పరిశోధకుడొకరు తమ పరిశోధనా గ్రాంటు రెండో విడత విడుదలలో జాప్యం ఎదురైనట్లు వెల్లడించిన విషయాన్ని ఎడెక్స్లైవ్ నివేదించింది. 2023 డిసెంబరు 18న లోక్సభలో ఐఐటిలు, ఐఐఎస్సిల పరిశోధనా నిధులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ జీతాలు, పెన్షన్లు, ఉపకార వేతనాలు, ఫెలోషిప్లు, పరికరాలు, ఇతర ఖర్చుల కోసం సంస్థల నుంచి వచ్చే అంచనాలును చూసుకుని బడ్జెట్ కేటాయింపుల మేరకు నెలవారీ చెల్లింపులు చేస్తున్నామని తెలిపింది. అయితే, పరిశోధనలకు, వివిధ ప్రాజెక్టులకు సకాలంలో నిధులు విడుదల కావడం లేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నియమాకాల సంగతి ఏంటి?
ఈ ఏడాది జనవరి 30 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, దేశంలోని 23 ఐఐటి ల్లో మొత్తం 12,498 అధ్యాపక పోస్టులు మంజూరై ఉండగా, వాటిలో 4,804 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 38.4 శాతం పోస్టులు భర్తీ కాలేదు. ఎన్డిటివి కథనం ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి (ఎన్డిటివి కథనం ప్రకారం) ఐఐటి ఖరగ్పూర్లో మంజూరైన అధ్యాపక పోస్టుల్లో 51.3 శాతం, ఐఐటి కాన్పూర్లో 39శాతం, ఐఐటి బాంబేలో 38.36శాతం, ఐఐటి ఢిల్లీలో 38.33శాతం ఖాళీగా ఉన్నాయి.







కామెంట్లు (0)