- యూసుఫ్ పఠాన్‌కు బిజెపి సర్కారు నజరానా
- వడోదర కార్పొరేషన్ తీర్మానం
వడోదర : పార్టీ మారిన రెండు నెలలకే ఎంపి యూసఫ్ పఠాన్‌కు లబ్ధి చేకూరుస్తూ బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూసఫ్ పఠాన్ ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)ని వీడి బిజెపి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, గుజరాత్‌లోని వడోదరలో ఆయన నివాసముంటున్న బంగ్లాకు ఆనుకుని రూ.20.5 కోట్లు విలువైన 978 చదరపు మీటర్ల స్థలం ఉంది. కానీ ఆ స్థలం అక్రమమైందని, ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ మున్సిపల్ కార్పొరేషన్( విఎంసి) నోటీసు కూడా జారీ చేసింది. కానీ, సదరు ఎంపి పార్టీ మారడమే తరువాయి ఆ స్థలాన్ని కట్టబెడుతూ విఎంసి తీర్మానం చేసిందని ది ఇండియన్ ఎక్సప్రెస్ నివేదించింది. తాండల్జాలోని టౌన్ ప్లానింగ్ స్కీమ్ నంబర్ 22, ఫైనల్ ప్లాట్ నంబర్ 90గా ఉన్న ఈ స్థలం, పఠాన్ కుటుంబం నివసించే ఇంటికి పక్కనే ఉంది. యూసుఫ్, ఆయన తమ్ముడు, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తమ కుటుంబాలతో కలిసి అక్కడే నివాశముంటున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతోనే ఆ స్థలాన్ని యూసుఫ్‌కు ఇస్తున్నామని వదోదర కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
వేలాన్ని రద్దు చేసి...
ఈ ఏడాది జులైలో కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఈ స్థలం బహిరంగ వేలానికి సిద్ధపడి, చదరపు మీటరుకు రూ.2.10 లక్షల విలువగా నిర్ణయించారు. ఆ లెక్కన స్థలం విలువ సుమారు రూ.20.5 కోట్లు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ మరింత అధికంగా ఉంటుందనేది నిపుణుల మాట. అయితే, ఈ వివాదం 2012లో మొదలైంది. అప్పటి నుండి ఈ స్థలం చుట్టూ కంచె వేసి పఠాన్ ఆక్రమించారు. అంతర్జాతీయ క్రికెటర్‌గా తనకు ప్రజాదరణ ఉందని, దీంతో భద్రతా ఆందోళనలున్నాయని, పక్కనే ఉన్న స్థలం భద్రతకు పెంచుకోవడాని అనువుగా ఉంటుందని పేర్కొంటూ, వేలం లేకుండా 99 ఏళ్ల లీజుపై ఆ స్థలం ఇవ్వాలని పఠాన్ విఎంసిని గతంలో కోరారు. అయితే వేలం లేకుండా నేరుగా కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అవసరం. 2014 జూన్‌లో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తర్వాత కూడా పఠాన్ స్థలానికి కంచె వేసి ఆక్రమించడం గమనార్హం. అలాగే, ఆయన బహరంపూర్ లోక్‌సభ స్థానం నుండి గెలిచిన అనంతరం ఆక్రమించిన స్థలం అప్పగించాలని విఎంసి నోటీసు ఇచ్చింది. దీనిపై 2025 ఆగస్టులో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. అంతేకాకుండా, చెల్లింపు లేకుండా సుదీర్ఘకాలం అధీనంలో ఉంచుకున్నంత మాత్రాన చట్టబద్ధ హక్కు ఏర్పడదని, ప్రముఖులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ కోర్టు పఠాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.







కామెంట్‌లు (0)