న్యూఢిల్లీ : భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల సెగ ఒకవైపు పీడిస్తుంటే, మరోవైపు వంటింటికి అవసరమైన టమోటా, ఉల్లి, బంగాళాదుంపల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో వినియోగదారులు వాటిని భారీగా ధరలు చెల్లించి కొనుగోలు చేస్తుంటే, పండించిన రైతులకు మాత్రం లాభం శూన్యం. గత వారం రోజులుగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన ధరల పర్యవేక్షణ విభాగం అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల వ్యవధిలోనే టమోటా ధరలు రూ.31 నుండి రూ.53 కి చేరి దాదాపు రెట్టింపయ్యాయి. ఉల్లి ధర కూడా కిలోకు రూ.5 పెరిగి రూ.32 కి చేరింది. బంగాళాదుంపల ధరలు సైతం ఇదే బాటలో సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా కొన్ని పరిమిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మినహా దేశమంతటా ఈ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం కూరగాయలే కాకుండా బియ్యం, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పుతో పాటు పామాయిల్ ధరలు కూడా పెరగడంతో సామాన్య వినియోగదారుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.
రిటైల్ మార్కెట్‌లో ధరల పెరుగుదల భారీగా ఉంటే, క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రిటైల్ మార్కెట్‌లో కిలో టమోటా రూ.50 దాటినా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి బంగాళాదుంపలు, కూరగాయలు పండించే రాష్ట్రాల్లో రైతులకు కిలోకు కేవలం రెండు మూడు రూపాయలు మాత్రమే దక్కుతుండటం గమనార్హం. పెరిగిన ఇంధన ధరల వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రైతులు తమ పంటను కనీసం మార్కెట్‌కు తరలించేందుకు కూడా డబ్బులు లేక పంటచేలల్లోనే వదిలివేస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా నేత, అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. ప్రభుత్వం దీనిని కేవలం కాలానుగుణంగా వచ్చే సమస్యగా కొట్టిపారేస్తూ చేతులుదులుపేసుకుందని విమర్శించారు. రైతుకు లాభం లేకపోగా, భారీ ధరలకు కొనుగోలు చేయడంతో వినియోగదారుల జేబులకు చిల్పుల పడుతోంది. కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపారులు మాత్రం ప్రభుత్వ అండతో భారీగా లాభపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అరికట్టేలా చర్యలు చేపట్టాలని, రైతులకు, వినియోగదారులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.








కామెంట్‌లు (0)