న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) జులై 20న ఢిల్లీలో చేపట్టిన నిరసనపై పోలీసుల క్రూరత్వంపై విచారణ జరుపుతున్న ఉన్నత స్థాయి విచారణ కమిటీ (హెచ్‌పిఇసి)కి చాలా తక్కువ ఫిర్యాదులు అందాయని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. అక్టోబర్31న సమర్పించిన చర్యల నివేదిక ప్రకారం, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లు తమ వద్ద ఉన్న వీడియో క్లిప్పులతో సహా ఇతర ఆధారాలను విచారణ కమిటీకి సమర్పించుకోవచ్చని కోర్టు అనుమతించింది. పేర్లు వెల్లడించకుండా (అజ్ఞాతంగా) ఫిర్యాదులు చేసేందుకు వీలుగా హెచ్‌పిఇసి కొత్త పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.
నిరసన సందర్భంగా పోలీసులు ఉపయోగించిన మందుగుండు సామగ్రి రకానికి సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీసులు హెచ్‌పిఇసి ముందు ఎందుకు నమోదు చేయలేదని పిటిషనర్లు ప్రశ్నించారు.దీనిపై స్పందించిన కోర్టు,విచారణ ప్రారంభించే ముందు అన్ని వివరాలు,ఆధారాలను సమీకరించేందుకు కమిటీ వేచి చూస్తుండవచ్చని పేర్కొంది.అయితే,ఆలస్యం చేయకుండా వాస్తవ నిర్ధారణ నివేదికలను సమర్పించడం ప్రారంభించాలని హెచ్‌పిఇసిని ఆదేశించింది.
2026 జులై 20న ఢిల్లీలో సిజెపి చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పోలీసులు అణచివేశారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన అతిపెద్ద నిరసనల్లో ఇది ఒకటి. ఈ నిరసనపై పోలీసుల దాడితో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో సుమారు 38మందిని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీకి, సుమారు 65మందిని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురికి ఎముకలు విరగడంతో పాటు పెల్లెట్లు,టియర్ గ్యాస్ వినియోగించడంతో తల,కంటికి తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీలో ఇంటర్నెట్‌ను నిలిపివేసిన సమయంలో పోలీసులు నిరసనకారులపై దాడులు చేపట్టారు.







కామెంట్‌లు (0)