- బిజెపిపై కాంగ్రెస్ ఆగ్రహం
న్యూఢిల్లీ : ప్రమాదకరమైన, వినాశకరమైన డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవడం కోసమే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 88 రోజులు గడిచినా ఇంకా సెషన్‌ను ప్రోరోగ్ చేయలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. లోక్‌సభలో ఎలాగైనా అక్రమ పద్ధతిలో మూడింట రెండొంతుల మెజారిటీని సంపాదించడానికి అమిత్ షాకు సమయం ఇవ్వడానికే 88 రోజులైనా సెషన్‌ను ప్రోరోగ్ చేయలేదని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు.
నాలుగు సార్లు మోడీకి ఖర్గే లేఖ రాశారు : జైరాం రమేశ్
డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గత ఆరు నెలల్లో ప్రధాని నరేంద్ర మోడీకి నాలుగు సార్లు లేఖలు రాశారని జైరాం రమేశ్ తెలిపారు. అయినా ప్రధాని మోడీ అందుకు మొండిగా నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. భారత పార్లమెంటరీ విధానాలపై ప్రామాణిక గ్రంథమైన 'కౌల్ అండ్ శక్ధేర్' 8వ సంచికలోని 192వ పేజీలో లోక్‌సభ నిరవధిక వాయిదాకు, సమావేశాల ప్రొరోగ్‌కు మధ్య సాధారణంగా 2-4 రోజుల వ్యవధి ఉంటుందని వెల్లడించారు. కానీ అదే పేజీలోని ఫుట్ నోట్ 53లో సెషన్ ప్రోరోగ్ గరిష్ఠ వ్యవధి 28 రోజులుగా ఉందని, అది కూడా 2015 నాటి వర్షాకాల సమావేశాలకు సంబంధించినదని స్పష్టం చేశారు. 2024లో విడుదలైన ఈ పుస్తకానికి ప్రధాని మోడీ ప్రత్యేక సందేశం కూడా పంపారని గుర్తు చేశారు.
'అప్పట్లో ప్రత్యేక పరిస్థితుల కారణంగా సభ ప్రోరోగ్ కాలేదు'
2008 (యుపిఎ ప్రభుత్వం)లో కూడా రికార్డు స్థాయిలో 87 రోజుల పాటు సభను రద్దు చేయకుండా ఉంచారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవలే లేఖ రాయడంపైనా జైరాం రమేశ్ స్పందించారు. "2008లో ప్రత్యేక పరిస్థితుల కారణంగా అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే 87 రోజుల పాటు సెషన్ ప్రోరోగ్ కాలేదు. అయినప్పటికీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లెక్క ప్రకారం చూస్తే ఈ రోజు (సోమవారం) ఒక కొత్త రికార్డు నమోదైంది. 2008తో సహా గతంలాగా కాకుండా లోక్‌సభలో అక్రమ పద్ధతిలో మూడింట రెండొంతుల మెజారిటీని ఎలాగోలా సాధించి ప్రమాదకరమైన, వినాశకరమైన డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర హోం మంత్రికి సమయం ఇవ్వడానికే ఈ రికార్డును నెలకొల్పారు. గతంలో 2026 ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రతిపక్షాల ఐక్యత కారణంగా ఈ బిల్లు విషయంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమిత్ షా దుష్ట పన్నాగాలను విపక్షాలు సునాయాసంగా ఓడించాయి. మరోసారి అమిత్ షా బుల్డోజర్ ఎత్తుగడలను అడ్డుకుంటాం" అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)