శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశాన్ని అమ్మేసింది ఎవరు?

14 నిమిషాల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 12:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎస్‌ఐఆర్‌‌ను రద్దు చేయాల్సిందే

- కొచ్చిన్‌‌ ర్యాలీలో అభిజిత్ దీప్కే

కొచ్చిన్‌ : భారత్‌ ‌దేశాన్ని అమ్మేసింది ఎవరు? అని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) జాతీయ కన్వినర్ అభిజిత్‌ ‌దీప్కే ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)‌ను ఉపసంహరించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ‘జంతర్‌ ‌మంతర్‌ ఎట్‌ ‌కోచి’ పేరుతో సిజెపి శనివారం కొచ్చిన్‌‌లోని రాజేంద్ర మైదాన్‌‌లో నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ నిరసన ర్యాలీలో సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్‌ ‌దీప్కే, నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్‌ ‌రాజ్‌, జాతీయ నేత అఫ్రీన్‌ ‌నవాజ్‌, సిజెపి దక్షిణ భారత ఇన్‌‌చార్జి విజయ్‌ ‌రెడ్డి మల్లంగి, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు చింతా జెరోమ్ ప్రభృతులు పాల్గొన్నారు.

​దేశమంతా అరెస్టు చేసుకోండి...

దీప్కే మాట్లాడుతూ ‘ఈ త్రివర్ణ పతాకాన్ని ఎత్తినందుకు నన్ను జైలుకు పంపారు. నా ఇద్దరు సోదరులు సౌరవ్, ఆశుతోష్ కూడా అందుకే జైలుకు వెళ్లారు. భారత్‌లో ఇలా జరిగింది బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడే’’ అని ఆయన అన్నారు. ‘‘నరేంద్ర మోడీకి చెప్పదలచుకున్నా, ఈ త్రివర్ణ పతాకాన్ని ఈ దేశంలోని ప్రతి చోటికీ తీసుకెళ్తా. అరెస్టు చేయాలనుకుంటే ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళం, తమిళనాడు.. ఎక్కడైనా చేసుకోండి. దేశంలోని ప్రతి ప్రాంతంలో అరెస్టు చేయండి, కానీ నేను మళ్లీ వచ్చి ఈ జెండాను ఎగురవేస్తా’’ అని ఆయన ప్రకటించారు. అలాగే, ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛలను క్రమంగా హరిస్తోందని దీప్కే విమర్శించారు. ‘మొదట మీరు ఏం తినాలో నియంత్రించాలనుకున్నారు, తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ప్రేమించాలో. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో నియంత్రించాలనుకునే స్థాయికి వచ్చారు’ అని అన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ఎస్‌ఐఆర్‌‌ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. బిఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలను దేశ ఆదర్శాలను తీర్చిదిద్దిన నేతలుగా ప్రశంసించారు.

​పోరు కొనసాగుతుంది..

దేశవ్యాప్తంగా అక్రమంగా 13కోట్ల మందికి పైగా ఓట్లను తొలగించారన్నారు. ఈ పరిస్థితుల్లో స్వతంత్ర, నిష్పాక్షిక ఎన్నికల వ్యవస్థకు హామీ కల్పించేంత వరకు ఈ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత్‌‌ను అస్థిర పరిచేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వారికి సిజెపి లొంగిపోయిందంటూ బిజెపి పెద్దలు చేస్తున్న ప్రచారంపై దీప్కే మాట్లాడుతూ ‘‘నేను ప్రధాని మోడీని అడగాలనుకుంటున్నది ఒక్కటే, ట్రంప్‌‌నకు లొంగిపోయింది ఎవరు? ట్రంప్‌ ఆదేశాల మేరకు రష్యా చమురును కొనుగోలు ఆపేందుకు అంగీకరించింది ఎవరు? భారత్‌ 18శాతం టారిఫ్‌‌లను ఎదుర్కొంటూ ప్రతిగా సున్నా టారిఫ్‌‌లను విధించేందుకు అంగీకరిస్తూ ఒప్పందాన్ని ఆమోదించింది ఎవరు? ఈ దేశాన్ని అమ్మేసింది మీరు... మేం కాదు. ట్రంప్‌‌నకు భారతదేశాన్ని మీరు అమ్మేశారు. మేం చేయలేదు. ఇక మీరు ఎవరికి అమ్మారో ఆ వ్యక్తి విషయానికి వస్తే, ఈరోజు ఆయన తనకు తానుగా సంక్షోభంలో కూరుకున్నాడు.’’ అని వ్యాఖ్యానించారు. కేరళం మాజీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ముఖ్యమంత్రికి కార్యదర్శిగా నియమించడం సరికాదని దీప్కే అన్నారు. పశ్చిమ బెంగాల్‌‌లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుందన్నారు. అక్కడ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషనర్‌‌ను ముఖ్యమంత్రి చీఫ్‌ ‌సెక్రటరీగా నియమించారన్నారు.

ప్రజాస్వామ్యాన్ని దేశ యువత కాపాడుకుంటుంది : ప్రకాష్‌ ‌రాజ్‌

దేశంలోని యువత మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటారని ప్రకాష్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సాగే ఈ పోరాటం రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా సామాన్య పౌరుల నేతృత్వంలోనే ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు వ్యతిరేకంగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో పోరాడుతున్న యువతకు అందరూ అండగా నిలవాలని కోరారు. అలాగే, ఇది హక్కుల కోసం పోరాడే నిరసనల యుగం అని అన్నారు. ప్రతి ఒక్కరూప్రజా ఉద్యమాలలో భాగస్వాములు కావాలని కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్