న్యూఢిల్లీ : వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు గతంలో ఇచ్చిన హామీలను దేశాలు ఈసారైనా అమలు చేస్తాయా? అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన నిధులు అందుతాయా? బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగాన్ని తగ్గించే దిశగా స్పష్టమైన కార్యాచరణకు అంగీకారం కుదురుతుందా? ఈ ప్రశ్నల మధ్య ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల 31వ సదస్సు (కాప్ 31) ఈ నెల 9 నుంచి 20 వరకు టర్కీలోని ఆంటాల్యాలో జరగనుంది. 190కి పైగా దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. వీరితో పాటు, ఎన్జిఓలు, పర్యావరణ వేత్తలు అందరూ కలిసి దాదాపు లక్ష మంది సదస్సుకు చేరుకుంటారని అంచనా. సదస్సులో భాగంగా అత్యంత కీలకమైన ప్రపంచ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల శిఖిరాగ్ర సదస్సు ఈ నెల 11, 12 తేదీలలో జరగనుంది. సదస్సుల్లో ప్రకటించిన లక్ష్యాలు, హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ప్రధాన అజెండాగా ఈ సారి చర్చలు జరగనున్నాయి. అయితే, చర్చలు ఎంత సుదీర్ఘంగా సాగినప్పటికీ అంతిమ ఫలితం ప్రశ్నార్ధకమే! ఉద్గారాలు పెరుగుతుండటం, వడగాలులు, వరదలు, కరువులు, అడవి మంటలు తీవ్రతరం కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో నిధుల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు పట్టుపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు
అమలు కావాల్సిన కీలక హామీలు
శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపు: బొగ్గు, చమురు, సహజవాయువులపై ఆధారపడటాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధనాలవైపు మళ్లాలని గత సదస్సుల్లోనూ అనుకున్నప్పటికీ ఆ దిశలో అడుగులు పడటం లేదు. ముఖ్యంగా అమెరికా వైఖరి దీనికి ఆటంకంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఇంధన వినియోగంలో విద్యుత్ వాటాను 2035 నాటికి 35 శాతానికి పెంచాలన్నది కాప్ 31 ప్రధాన లక్ష్యం! దీనిని సాధించాలంటే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాల్సిఉంది. అదే సమయంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఉన్న కోట్లాది మంది కార్మికులకు, వాటిపై ఆధారపడి ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయాలు చూపడం, అవసరమైన సాయాన్ని అందించడం ఎలా అన్న విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కావడం లేదు. అలాగే గత సమావేశాల్లో హామీలిచ్చిన నిధులు, పరిహారాలు, జాతీయ ప్రణాళికల అమలు, వివిధ అంతర్జాతీయ ఒప్పందాల అమలులో సమన్వయం తదితర అంశాలపై కూడా కాప్ 31లో చర్చింనున్నారు. టర్కీ ఆతిథ్యంలో జరగనున్న ఈ సదస్సులో చర్చల నిర్వహణ బాధ్యతలను ఆస్ట్రేలియా చేపడుతోంది. టర్కీ పర్యావరణ, పట్టణీకరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి మురాత్ కురుమ్ సదస్సు అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఆస్ట్రేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బోవెన్ చర్చలకు అధ్యక్షత వహించనున్నారు. సదస్సు నిర్వహణ కోసం రెండు దేశాలు పోటీ పడటంతో ఈ ఏర్పాటు చేశారు. ఈ సంయుక్త బాధ్యతల ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!








కామెంట్లు (0)