మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రిలయన్స్ కు ‘బొగ్గు’ కోసం రైతుల జీవితాలు బుగ్గి!

1 గంట క్రితం

rythu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 04:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల, చింతలపూడి ప్రతిపాదిత బొగ్గు గనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డి.పి.ఆర్) ప్రకటించకుండా రైతులు, ప్రజల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయి. రూ. లక్షల కోట్ల విలువ కలిగిన ప్రజా సంపదను రిలయన్స్ కంపెనీకి ఏ విధంగా కట్టబెడతారన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యు.సి.జి) ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు, రైతులకు తెలియజేయకుండా రిలయన్స్ కంపెనీకి లీజు ఇచ్చేశారు. రైతులు, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా రిలయన్స్ కంపెనీ బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి చేస్తుందని ప్రభుత్వాలు ప్రకటించడం దుర్మార్గం. రూ.2.73 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని మాయమాటలు చెప్తూ ఆచరణలో జరిగే విధ్వంసం గురించిన సమాచారం మాత్రం వెల్లడించడం లేదు. సస్యశ్యామలంగా ఉన్న ఈ ప్రాంతంలో బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి వలన పర్యావరణానికి కలిగే ముప్పు, ఇతర అంశాలను వెల్లడించడం లేదు. ప్రజల జీవనానికి, పంటలకు నష్టం కలిగించే చాలా విషయాలపై స్పష్టత ఇవ్వడం లేదు.

గతంలో జరిగిన భూ సేకరణల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అధికారులు, ప్రభుత్వాలు రైతులకు మాయమాటలు చెప్పి బలవంతంగా భూములు లాక్కున్నారు. ప్రతిపాదిత బొగ్గు గనికి సంబంధించిన విషయంలో కూడా ఇదే పరిస్థితి. 2013 భూసేకరణ చట్టం అమలు కావడం లేదు. యు.సి.జి ప్రాజెక్టు కోసం 8562 ఎకరాలు భూసేకరణ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శెట్టివారిగూడెంలో పైలెట్ ప్రాజెక్టు కోసం ముందుగా 77 ఎకరాల భూ సేకరణ చేస్తామంటున్నారు. చింతలపూడి మండలంలోని అనేక గ్రామాలలో వేలాది ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. యు.సి.జి ప్రాజెక్టుకు తాము భూములు ఇవ్వలేమని రైతులు చెబుతున్నా వారి మాటలను బేఖాతరు చేస్తూ రెవిన్యూ అధికారులు భూముల మీదకు సర్వేకు వస్తున్నారు. రెవిన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు రిలయన్స్ కంపెనీ కోసం భూసేకరణ చేసేందుకు ఎంతగా పరితపిస్తున్నారో అర్థం చేసుకోడానికి ఇదో నిదర్శనం. వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో రిలయన్స్ కంపెనీ ప్రయోజనం కోసమే పని చేస్తున్నారు.

రిలయన్స్ కోసం మా జీవనాన్ని, మా పంటలు, మా భూములను, మా గ్రామాల అభివృద్ధిని నాశనం చేస్తే ఎలా ఒప్పుకుంటామని రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాల నుండి సమాధానం లేదు. చింతలపూడి, రేచర్ల బ్లాక్ లలో 150 కోట్ల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నది. అన్ని అనుమతులు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ, అటవీ, పర్యావరణం, జల వనరులు, పరిశ్రమలు, ఎపిఐఐసి, ఎపి ఆర్థికాభివృద్ధి మండలి శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. అయితే ప్రాథమికంగా ఇంతవరకు బొగ్గు గని ప్రాంత రైతులతో, ప్రజలతో చర్చించలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. భూమి లోపల బొగ్గు కాల్చినప్పుడు ప్రమాదకర రసాయనాలు భూగర్భ పొరల్లోకి ఇంకిపోతాయి. గాలిలో కలుస్తాయి. భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువులు పూర్తిగా విషతుల్యం అవుతాయి. తాగునీరు, సాగునీరు పనికి రాకుండా పోతుంది. ఈ ప్రాణాంతక వాయువులతో ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుంది. క్యాన్సర్, శ్వాసకోశ, పునరుత్పత్తి, చర్మ... తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జీవవైవిధ్యం నాశనమౌతుంది. జంతువులు రోగ నిరోధక శక్తిని కోల్పోతాయి. పంటలు దెబ్బతింటాయి. చివరకు ప్రజలు నివసించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది.

బొగ్గును మండించడం ద్వారా ప్రజలకు, రైతులకు పొగబెడతారు. ఫలితంగా తమ గ్రామాలు, తమ భూములను వదిలి పోవాల్సిన దుస్థితిని కల్పిస్తారు. చింతలపూడి బ్లాక్‌ ‌లోని మూడు వేల ఎకరాల్లో జి -12 రకం 900 మిలియన్ టన్నులు బొగ్గు ఉంది. రేచర్ల బ్లాక్ లో 5500 ఎకరాల్లో జి -13 రకం బొగ్గు 2225 మిలియన్ టన్నులు ఉంది. ఇక్కడ భూగర్భంలో 600 మీటర్ల నుండి 1123 మీటర్ల లోతులో గ్యాసిఫికేషన్ చేస్తారు. గ్రామాలు ఖాళీ చేయనవసరం లేదు. భూములు ఇస్తే చాలు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. రైతులు పంట భూములు ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో రైతువారీ ఉపాధి అవకాశాలు ఏమీ ఉండవు. ఇక్కడ అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగవుతున్నది. రైతులే కాకుండా అత్యధిక మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. యుసిజి ప్రాజెక్ట్ వలన ఇక్కడ ప్రజలకు, రైతులకు దొరికే ఉపాధి ఏమీ లేదు. లక్షల కోట్ల పెట్టుబడి వలన అభివృద్ధి అని చెబుతున్నారు. గ్రామాలు, పంటలు నాశనమైన తర్వాత జరిగే అభివృద్ధి ఏమీ ఉండదు. రిలయన్స్ కు లక్షల కోట్ల ప్రజా సంపద కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలతో దోబూచులాడుతున్నాయి.

ప్రతిపాదిత బొగ్గు గని (యు.సి.జి)కి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డి.పి.ఆర్)ను ఇంతవరకు బహిర్గతం చేయలేదు. గ్రామసభలు నిర్వహించలేదు. 2013 భూ సేకరణ చట్టప్రకారం ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు అవసరాల కోసం భూసేకరణ చేయాల్సి వస్తే ప్రజల ఆమోదం తీసుకోవాలి. ఇందులో కూడా ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ అయితే 70 శాతం ప్రజలు ఆమోదించాలి. అదే ప్రైవేటు అవసరాల కోసమైతే 80 శాతం ప్రజలు ఆమోదం పొందాలి. పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. కానీ యుసిజి ప్రాజెక్టు కోసం ప్రజల ఆమోదం లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా రైతుల భూముల మీదకు వచ్చి రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు సర్వేలు చేయడం, ప్రభుత్వ రెవెన్యూ అధికారులు భూమి సర్వే కొలతలకు రావడం... అంతా చట్ట విరుద్ధంగా జరిగిపోతున్నది. రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ప్రభుత్వాలే కాలరాస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చింతలపూడి ప్రాంత రైతులు, ప్రజలు తమ జీవనం, మనుగడ కోసం ఉద్యమం చేయడం తప్ప మరో మార్గం లేదు.


వ్యాసకర్త : కె.శ్రీనివాస్,

ఎ.పి రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి,

ఏలూరు, సెల్: 94900 98574

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్