ఆక్వా (రొయ్యలు, చేపలు) రైతాంగాన్ని మేతల ధరల భారం కృంగదీస్తోంది. ఒకవైపు ఎంతో కష్టంతో, టెన్షన్‌తో సేద్యం చేస్తుంటే కంపెనీలు సిండికేట్లయి ధర తగ్గించి కొంటున్నాయి. కౌంట్లు వారీగా ప్రభుత్వం ప్రకటించిన కనీస ధర కూడా చాలా సందర్భాల్లో దక్కక ఆక్వా రైతులు నిండా మునిగిపోతున్నారు. దీనికి తోడు బోడి గుండుపై తాటి పండు పడ్డ చందంగా మేతలు, మందుల ధరలు ఆక్వా రైతులు మోయలేని భారంగా తయారయ్యాయి.
కంపెనీల బేఖాతరు - చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు
మేతల కంపెనీలు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తున్నాయి. ‘అప్సడా‘ కమిటీలో ధరలను చర్చించాలన్న కనీస సూత్రాన్ని పాటించడంలేదు. రైతుల ఆందోళన, తీవ్ర ఆవేదనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా మేత ధర తగ్గించమని రైతులు ఆందోళన చేస్తుంటే లెక్కలేనితనంతో పెంచుతున్నాయి. కంపెనీలను ధర తగ్గించమని చెబుతాం.. తగ్గిస్తారని ముఖ్యమంత్రి ప్రకటించినా తగ్గించింది కంటి తుడుపుగా కేవలం కిలోకు రూ.2 నుంచి రూ.4 మాత్రమే. రైతులు కనీసంగా రూ.9 తగ్గించమని కోరుతున్నారు. పెంచినప్పుడు మాత్రం రూ.25 పైగా పెంచారు. ఇటీవల తిరిగి రూ.9 పెంచారు. పెంచిన ధరలపై హైకోర్టు స్టే విధించింది. అయినా చాలా ప్రాంతాల్లో పెంచిన ధరలకు అమ్ముతున్నారు. అంటే బడా కంపెనీలు కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నాయి. రైతుల కష్టంతో వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయల లాభాలు గడిస్తున్నారు. ప్లాంట్లను విస్తరించుకుంటున్నారు. ఈ కంపెనీలకు ఈ ధైర్యం, లెక్కలేని తనం ఎక్కడ నుండి వచ్చింది? ప్రభుత్వాల నిర్వాకమే అని చెప్పక తప్పదు. ప్రభుత్వ నియంత్రణలో కంపెనీలున్నాయా? కంపెనీలే ప్రభుత్వాలను, అధినేతలను కంట్రోల్ లో పెట్టుకుంటున్నాయా? అనే అనుమానం రాక తప్పదు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా కంపెనీలు ధర తగ్గిస్తాయని సాక్షాత్తూ వ్యవసాయ శాఖమంత్రి ప్రకటించినా అమలు కాలేదంటే మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోయినా ఏ చర్యలూ లేవు. పట్టించుకున్నదీ లేదు.
అమలు కాని విద్యుత్ రాయితీ
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 2 సంవత్సరాల తర్వాత ఎన్నికల హామీ అయిన విద్యుత్ రాయితీ జీవోను ఇటీవల తీసుకొచ్చింది. పాలకొల్లులో భారీ రైతు సభలో అట్టహాసంగా మంత్రులు జీవో విడుదల చేసి ప్రకటించారు. నెల రోజులు దాటినా నేటికీ అమలు కాలేదు. పైగా పవర్ ఫ్యాక్టర్ అంటూ విద్యుత్ సబ్సిడీకి షరతులు పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం భావ్యం కాదు. పైగా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ పరికరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సీడ్ నాణ్యతపై కూడా ప్రభుత్వం, ఎంపెడా, మత్స్య శాఖ అజమాయిషీ లేదు. కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు మధ్యతరగతి రైతులకు అందుబాటులో లేవు.
సమస్యల పరిష్కారం కోసం ...
విదేశీ మారకద్రవ్యం రూపంలో వేల కోట్ల రూపాయలు కేంద్రం...పన్నులు, సెస్సుల రూపంలో వందల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రం పొందుతూ... ఆక్వా రైతులను గాలికి వదిలేయడం భావ్యం కాదు. మేతల ధరలు తగ్గించాలని, విద్యుత్ రాయితీ అమలు చేయాలని పార్టీలకు అతీతంగా ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కి రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వాలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి.
ఎంపెడా, అప్సడా, మత్స్యశాఖ, ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు, కేంద్ర వాణిజ్య శాఖ రైతుల ప్రయోజనాలను కాపాడాలి. మేతలు, మందుల ధరలు తగ్గించేలా విద్యుత్ సబ్సిడీ జీవో అమలు చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన సీడ్, ఫీడ్ ప్రభుత్వమే రైతాంగానికి అందించాలి. ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. కోల్డు స్టోరేజీ, ల్యాబ్ సౌకర్యాలు మార్కెట్ యార్డులలో రైతులకు ఉచితంగా కల్పించాలి. ఆక్వా పంట ప్రాంతాల్లో మౌలిక వసతులు, డ్రైనేజీ, పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యాలు కల్పించాలి. రొయ్యలు, చేపలకు న్యాయమైన ధర అందేలా ప్రత్యేక యంత్రాంగంతో చర్యలు చేపట్టాలి. ప్రభుత్వమే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. సమస్యల సాధనకు...రాజకీయాలు, పార్టీల అనుబంధాలకు అతీతంగా రైతాంగం ఐక్యంగా...మిగిలిన పంటల రైతాంగ ఉద్యమాల స్ఫూర్తితో పోరాడాలి.
- వ్యాసకర్త : బి. బలరాం
ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్







కామెంట్‌లు (0)