ఎలాగో ఒకలాగా ఏకగ్రీవమైపోయిన అభ్యర్థి మొహం లాగా వెలిగిపోతోంది విజయనగరం మెయిన్ రోడ్డు. ఎదురెదురుగా, జెండాలు లేని రెండు ఊరేగింపుల్లాగా జనం కదులుతున్నారు. పైడితల్లమ్మ పండక్కి టౌన్ లో మందు షాపులు బంద్. బంధువుల పిలుపులతో పండక్కి వచ్చినోళ్ళలో, అలవాటున్నోళ్లు , వర్షానికి నానిపోయి సుట్ట పీకల్లాగా సుట్టుకు పోతున్నారు. బెల్ట్ షాపుల అడ్రస్సులు తెలిసిన వాళ్ళు మాత్రం, ఆ సందు గొందుల్లోకి చొరబడుతున్నారు. రాయలసీమలో ఎక్కువ ఏకగ్రీవాలు కావడం వల్ల, కొంతమంది పోలీసులను వెనక్కి రప్పించేసి టౌన్ లో డ్యూటీలు వేశారు. బుస్సీ నాయుడు ఆహ్వానం మేరకు, దసుమంతు నాయుడు మిత్రబృందమంతా తరలి వచ్చింది. సంబరం చూడడానికి మెయిన్ రోడ్డు పక్కన ఒక మేడ మీద ఏర్పాట్లు చేశాడు బుస్సీ. ఆ పక్క డాబా మీద డ్యూటీలో ఉన్న కొందరు కానిస్టేబుళ్లు, టెంట్ కింద కుర్చీలు వేసుకుని బాతాఖానీ లోకి దిగారు. నాయుడు బృందానికి అది, మంచి కాలక్షేపంగా ఉంది.
" వడ్డీతో సహా వసూలు చేస్తానని జగన్, మొన్న వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు"-సీమ డ్యూటీ పడని ఓ కానిస్టేబుల్, వెళ్లి వచ్చిన కానిస్టేబుల్ ను అడిగాడు.
" ఇందాక కాలిరిగిందీ.. అందాక సిమెంట్ కట్టేస్కో.. ఎముక అతుక్కున్న తర్వాత ఎగిరి తందువుగానీ! అన్నట్టుంది యవ్వారం.. ఏటి చేసేస్తాడు. జరగాల్సిందంతా జరిగిపోయింది."- డోంట్ కేర్ అన్నట్టుగా మాట్లాడాడు, డ్యూటీ చేసి వచ్చిన కానిస్టేబుల్.
" టోపీ మీద సింహాలను చూసి డ్యూటీ చేయండి.. అని కూడా అన్నాడు కదా!"-మరొక కానిస్టేబుల్ గుర్తు చేశాడు.
" అలాంటి డ్యూటీల్లో హెల్మెట్ లు వేస్తాం గానీ, టోపీలు పెడతామేటీ! అయినా, ఆయన ఉద్దేశం మనకు అర్థమైంది. ఆ మూడు సింహాలు చూసి, ధర్మాన్ని కాపాడండి అని చెప్పడమే కదా!"
" మేము చేసింది అదే కదా! ఆ మూడు సింహాల మొఖాలు చూసే డ్యూటీ చేశాం"-నవ్వుతూ అన్నాడు ఆ కానిస్టేబుల్.
" సూసి డూటీ సేస్తే..అంత అదర్మంగా..ఎలాగ, ఏకగ్రీవాలు జరిగిపోనాయీ!"- చింపీసిన నామినేషన్ పత్రం లాగా చిన్నబోయింది పోలిపల్లి మొహం. అది చూసి చిన్నగా నవ్వాడు పరదేశి." ఇదిగో బ్రెదరూ! మనదంతా ఒకే పార్టీ " అంటూ, నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. పోలీసులు కూడా నవ్వుకున్నారు.
" ఇంతకూ, మీరు చూసిన ఆ మూడు సిమహాల ముఖాలు ఏటని, ఇదిగో.. మా వోడికి తెలీక.. ఇక్కడ విల విల్లాడిపోతన్నాడు" - అని పోలిపల్లి ని చూపించాడు పరదేశి.
" సింహం అంటే రాజు కదా సార్! రాజు అంటే పరిపాలించినోడు. ఆయన తరపున ధర్మాన్ని రక్షించడానికి మూడు సింహాల టోపీ మాకు తగిలించారు. మన దగ్గరకు వచ్చేసరికి, నిజంగా ముగ్గురూ రాజులే కదా!"
" అవునవును. ఒకరు సీఎం... మరొకరు డిప్యూటీ సీఎం.. సెంటర్లో పీఎం "-అర్థమై, గట్టిగా అనేసి పకపకా నవ్వాడు పరదేశి.
" పైగా, సెంటర్ సింహాన్ని చూస్తే మాకు నీతులు చెప్పిన ఈ సింగిల్ సింహం తోక ముడిచేస్తాది.. ఏటంటారు?"-వాళ్లు కూడా నవ్వారు.
పోలీస్ స్టేషన్ ఎదుట జెసి ప్రభాకర్ రెడ్డి లాగా, మంచం మీద పడుకున్న నాయుడు లేచి, నవ్వుతూ చప్పట్లు కొట్టాడు.
" ఇప్పుడేటంతావూ"-పోలిపల్లిని అడిగాడు పరదేశి.
"నానేటంతానూ! నువ్వేటంతే అదే అంతాను ".
సిరిమాను కదిలినట్టుంది. డప్పులు.. డోలు మోగాయి.
- ' నల్లి ' కుట్టు







కామెంట్‌లు (0)