మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాంతియుతంగా సమావేశమయ్యే, నిరసన తెలిపే ప్రాథమిక హక్కుపై....

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

భారత రాజ్యాంగం పౌరులందరికీ శాంతియుతంగా సమావేశమయ్యే, నిరసన తెలియచేసే ప్రాథమిక హక్కుకు హామీ కల్పిస్తోంది. సంఘటితమయ్యేందుకు, సమావేశమయ్యేందుకు, మాట్లాడేందుకు గల హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. ఈ ప్రాథమిక హక్కుల్లో దేన్ని కుదించినా కూడా అది ప్రజాస్వామ్యాన్ని కత్తిరించినట్లే అవుతుంది. కులం, హోదా, లింగబేధం లేకుండా ప్రతి పౌరుడికి ఇచ్చే హామీ ఇది. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం పోలీసుల దురుసుతనపు చర్యల ద్వారా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీలో ఆ హక్కులను కాలరాసేందుకు అత్యంత దారుణంగా ప్రయత్నించడం కలవరపాటుకు గురిచేసింది. సిజెపి, ఎఐఎస్‌ఎ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ ‌వంటి యువజన, విద్యార్థి సంఘాలు అక్టోబరు 10న శాంతియుత నిరసనలకు పిలుపిచ్చాయి. ఈ దేశ చట్టం ప్రకారం ఆ శాంతియుత సమావేశానికి హామీ కల్పించడానికి బదులుగా కేంద్రం దేశవ్యాప్తంగా దాడులకు ఆదేశించింది. వేలాదిమంది యువజనులను ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. సైనిక పాలనలో వున్నట్లుగా ఢిల్లీలో పూర్తిగా లాక్‌‌డౌన్‌ ‌ప్రకటించారు. రైళ్ళను రద్దు చేసేశారు, మరికొన్నింటిని ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రయాణికులను దారిలోనే అడ్డుకున్నారు. జర్నలిస్టులు, కార్యకర్తలు, విద్యావేత్తలు, లాయర్లపై దాడులు చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చట్టాన్ని దుర్వినియోగం చేయడమే, దాన్ని ఆయుధంగా మార్చడమే! ఢిల్లీ నట్టనడిబొడ్డున, గుర్తింపు బ్యాడ్జీలు లేని పోలీసు సిబ్బంది కనిపించడం వీడియోలో నమోదైంది. జులైలో ఆందోళన జరుపుతున్న యువతపై పోలీసుల దురుసుతనపు వ్యవహార శైలే దేశ రాజధానిలో శనివారం పునరావృతమైంది. కాకపోతే ఈసారి మరికొంచెం ఎక్కువ స్థాయిలో. నాటి ఆందోళనల సమయంలో మహిళా నిరసనకారులపై మగ పోలీసు సిబ్బంది దాడులు జరిపిన వీడియో సాక్ష్యాధారాలు వున్నప్పటికీ నెలలు గడిచినా, అటు ప్రభుత్వం కానీ ఇటు సుప్రీం కోర్టుగానీ ఆ చట్టాన్ని అమలు చేసే సంస్థల నిబంధనల ఉల్లంఘనలకు ఎవరినీ జవాబుదారీ చేయలేదు !

ప్రయాణాలపై లేదా సమావేశాలపై పూర్తి నిషేధాన్ని అనుమతించలేమని అక్టోబరు 9న కోర్టు స్పష్టం చేసింది. కానీ ఢిల్లీలో కచ్చితంగా జరిగింది అదే. మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్‌ ‌రాజకీయ నేతలు, లాయర్లతో సహా అందరినీ నగరం నలు మూలలా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన విచారణలో ఈ అంశం తీవ్రత, అత్యావశ్యకతను గుర్తించిన సుప్రీం కోర్టు తన ఆదేశాలను పునరుద్ఘాటించింది. కానీ, కోర్టు జారీ చేసిన అరకొర ఆదేశాలు కానీ, వ్యక్తం చేసిన అసంతృప్తి కానీ ఏవీ కూడా ప్రభుత్వాన్ని నిలువరించలేకపోయాయి. తన పని తీరుకు సంబంధించి వాస్తవాలను తెలియచేయడానికి బదులుగా విమర్శకులను విదేశీ ఏజెంట్లుగా, జాతి విద్రోహ శక్తులుగా ముద్ర వేసే తన ధోరణిని ప్రభుత్వం మరింత రెట్టింపు చేసినట్లు కనిపిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్‌ ‌కుమార్‌ను కాపాడుకునేందుకు బిజెపి ప్రభుత్వం ఇంతకు బరి తెగించింది. స్పష్టమైన అక్రమ చర్య ద్వారా కోట్లాదిమంది భారతీయులకు ఓటు హక్కును లేకుండా చేసిన ఎన్నికల కమిషన్‌‌ నుండి జవాబుదారీతనాన్ని కోరడానికి బదులుగా బిజెపి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనను కాపాడుకోవడానికి ప్రభుత్వ ఉక్కు పిడికిలి యంత్రాంగాన్ని మోహరించాయి. దీన్నిబట్టి చూస్తేనే జ్ఞానేష్‌ ‌కుమార్‌‌కు బిజెపితో వున్న అనుబంధం ఇతర పార్టీలతోగల సంబంధాల కన్నా చాలా భిన్నమైనదని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి, అంతేకానీ పౌరులకు వ్యతిరేకంగా అధికారాన్ని దుర్వినియోగం చేయరాదు.

(‘హిందూ’ సంపాదకీయం)

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్